
ఇంధనాన్ని పక్కదారి పట్టించడం, కృత్రిమ కొరత సృష్టించడం వంటి అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత మరియు అక్రమాలపై టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. అక్రమాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని హెచ్చరించారు.
కొన్ని ఇంధన బంకుల్లో స్టాక్ ఉన్నప్పటికీ ‘నో స్టాక్’ బోర్డులు పెట్టి వినియోగదారులను ఇబ్బంది పెడుతున్న ఘటనలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. అలాంటి బంకుల యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇంధన లభ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం అమల్లో ఉన్న రేషన్ విధానాన్ని కొనసాగించాలని సూచించారు.
వ్యవసాయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా ఆక్వా, వరి రైతులకు ఇంధన సరఫరాలో ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. సోషల్ మీడియా ద్వారా ఇంధన కొరతపై తప్పుడు వార్తలు ప్రచారం చేసి ప్రజల్లో భయాందోళనలు సృష్టించే వారిపై కేసులు నమోదు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు.
ఇంధనం ఇవ్వడానికి నిరాకరిస్తున్న బంకులపై 1967 టోల్ ఫ్రీ నంబర్‌కు వస్తున్న ఫిర్యాదులను జిల్లా అధికారులు వెంటనే పరిష్కరించాలని సూచించారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో బంకుల మూసివేతలు తగ్గాయని, చమురు కంపెనీల నుంచి సరఫరా మెరుగుపడిందని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు.