గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సమగ్ర చర్యలు

  1. రాష్ట్రాలు ప్రతిపాదిస్తే కొత్త ఐటీడీఏల ఏర్పాటుకు కేంద్రం సుముఖం
  2. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ప్రశ్నకు కేంద్రం సమాధానం

న్యూడిల్లీ: గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ, మౌలిక సదుపాయాల పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువాల్ ఓరాం తెలిపారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి నిధులు, కొత్త ఐటీడీఏల ఏర్పాటుపై కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

ఆర్టికల్ 275(1) గ్రాంట్లు, ప్రధాన్ మంత్రి ఆది ఆదర్శ గ్రామ యోజన, ధర్తి ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్, పీఎం-జన్‌మన్, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు, విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, గిరిజన జీవనోపాధి కార్యక్రమాల ద్వారా ఐటీడీఏ ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం సహకరిస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా వివిధ పథకాల కింద గిరిజన ప్రాంతాలకు నిధులు విడుదల చేస్తున్నట్లు వివరించారు.

ఐటీడీఏల సామర్థ్య పెంపు, సమగ్ర ప్రణాళిక, డేటా వ్యవస్థల బలోపేతం, ప్రజల భాగస్వామ్యం, శాఖల మధ్య సమన్వయానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. రహదారులు, గృహాలు, తాగునీరు, విద్యుత్, మొబైల్ కనెక్టివిటీ, ఏకలవ్య పాఠశాలలు, హాస్టళ్లు, ఆరోగ్య సేవలు, మాతా-శిశు సంక్షేమం, సికిల్ సెల్ అనీమియా నిర్మూలన, వ్యవసాయం, అటవీ ఉత్పత్తుల విలువ వృద్ధి, వన్ ధన్ వికాస్ కేంద్రాలు, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి శిక్షణ వంటి కార్యక్రమాలను సమన్వయంతో అమలు చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది.

కొత్త ఐటీడీఏల ఏర్పాటు, పునర్వ్యవస్థీకరణ లేదా విస్తరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదనలు పంపితే నిర్దేశిత ప్రమాణాల ప్రకారం పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి తెలిపినట్లు ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.