
అమలాపురం : కోనసీమ జిల్లాను సంపూర్ణ అక్షరాస్యత కలిగిన జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా “అక్షరాంధ్ర” రెండో దశ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోం నైదియాదేవి అధికారులకు పిలుపునిచ్చారు.
సోమవారం స్థానిక కలెక్టరేట్లో అక్షరాంధ్ర రెండో దశ కార్యక్రమ సన్నద్ధతపై నిర్వహించిన సమన్వయ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్, డీఆర్డీఏ, మెప్మా, స్వర్ణ గ్రామ, డ్వామా తదితర శాఖల అధికారులు గుర్తించిన నిరక్షరాస్యుల వివరాలు, వాలంటీర్ల సమాచారాన్ని అక్షరాంధ్ర యాప్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. ఈ నమోదు ప్రక్రియను మే 28 నుంచి జూన్ 30 వరకు పూర్తి చేయాలని సూచించారు.
జూన్, జూలై నెలల్లో రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో రిసోర్స్ పర్సన్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి, జూలై 1 నుంచి 20 వరకు మున్సిపల్ స్థాయిలో వాలంటీర్లకు శిక్షణ ఇవ్వాలని తెలిపారు. అనంతరం జూలై 21 నుంచి తరగతులు ప్రారంభించి 2027 మార్చి 15 వరకు కొనసాగించనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో సుమారు 100 గంటల బోధనా సమయం ఉండగా, 15 గంటలు ఆడియో–విజువల్ కంటెంట్, 40 గంటలు బోధనా కార్యక్రమాలు, 45 గంటలు ప్రాక్టికల్స్‌కు కేటాయించనున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు, కమ్యూనిటీ సెంటర్లలో హైబ్రిడ్ విధానంలో ఆన్లైన్, ఆఫ్‌లైన్ తరగతులు సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు.
మొదటి దశ విజయవంతం కావడంతో రెండో దశను మరింత పక్కా ప్రణాళికతో, ఆధునిక సాంకేతికతతో ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. 15 ఏళ్లు పైబడిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలు, స్వయం సహాయక సంఘాల సభ్యుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
కేవలం చదవడం, రాయడం మాత్రమే కాకుండా మొబైల్ ఫోన్ వినియోగం, ఆన్లైన్ బ్యాంకింగ్, ప్రభుత్వ పథకాల యాప్‌ల వినియోగం వంటి డిజిటల్ అక్షరాస్యతను కూడా నేర్పించనున్నట్లు చెప్పారు. స్థానిక యువత, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులను విద్యా వాలంటీర్లుగా భాగస్వామ్యం చేయాలని సూచించారు.
గ్రామ, వార్డు సచివాలయాల సహకారంతో నిరక్షరాస్యులను గుర్తించి మ్యాపింగ్ చేయడం ద్వారా కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న నిరక్షరాస్యత శాతాన్ని గణనీయంగా తగ్గించి వంద శాతం అక్షరాస్యత సాధించడమే లక్ష్యమన్నారు.
ఈ సమావేశంలో వయోజన విద్య నోడల్ అధికారి ఎం. విజయభాస్కరరావు, ఐసీడీఎస్ పీడీ నాగమణి, స్వర్ణ గ్రామం అధికారిణి విజయలక్ష్మి, ఉప విద్యాశాఖ అధికారి సూర్యప్రకాశం, డీపీఎం విజయ్‌కుమార్, మెప్మా అధికారులు తదితరులు పాల్గొన్నారు.