
జేఈఈ మెయిన్స్‌లో అద్భుత ప్రతిభ కనబరిచిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. 100 పర్సంటైల్ సాధించి టాపర్లుగా నిలిచిన నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిత్ 100 పర్సంటైల్ సాధించి రాష్ట్ర టాపర్‌గా నిలిచారు. తెలంగాణ నుంచి సాయి రిత్విక్ రెడ్డి, మహేశ్వరి, భవితేష్ రెడ్డి కూడా అత్యుత్తమ ఫలితాలతో టాపర్లుగా నిలిచారు. వీరితో పాటు నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు కె. పునీత్, గంటా రవితేజ, పి. సింధూర, శరణి కూడా ముఖ్యమంత్రిని కలిశారు.
విద్యార్థుల ప్రతిభను సీఎం ప్రత్యేకంగా ప్రశంసిస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తూ తెలుగు విద్యార్థుల ప్రతిభను ప్రపంచానికి చాటుతున్న నారాయణ విద్యాసంస్థల యాజమాన్యాన్ని, సిబ్బందిని కూడా అభినందించారు.