
చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాజోలు సీఐకు జనసేన నాయకుల వినతి
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న అసత్య, నిరాధార మరియు అనుచిత ప్రచారాలను అరికట్టాలని కోరుతూ రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు రాజోలు సర్కిల్ ఇన్స్పెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ, ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు చేసిన వ్యాఖ్యలు మరియు కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో చేస్తున్న తప్పుడు ప్రచారాలు జనసేన కార్యకర్తలు, అభిమానులను తీవ్రంగా కలవరపెడుతున్నాయని పేర్కొన్నారు.
ప్రజా సేవనే లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న పవన్ కళ్యాణ్‌పై ఆధారరహిత ఆరోపణలు చేయడం బాధాకరమని అన్నారు. ప్రజా జీవితంలో పారదర్శకత, నిజాయితీకి ప్రాధాన్యం ఇస్తూ పనిచేస్తున్న నాయకుడిపై అవాస్తవాలను ప్రచారం చేయడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న పవన్ కళ్యాణ్ దేశవ్యాప్తంగా గౌరవం పొందుతున్న నాయకుడని, అలాంటి వ్యక్తిపై వ్యక్తిగత దూషణలు, అసత్య ప్రచారాలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు.
సోషల్ మీడియా వేదికగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్న వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.