
కనిగిరి : ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో కనిగిరి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని అంజలిని జనసేన పార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు.
600 మార్కులకు గాను 585 మార్కులు సాధించి పాఠశాల టాపర్‌గా నిలిచిన అంజలికి కనిగిరి ప్రభుత్వ వైద్యశాల డెవలప్మెంట్ కమిటీ సభ్యుడు, జనసేన నాయకుడు అక్బర్ సైకిల్‌ను బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా అంజలిని అభినందిస్తూ ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ, విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం పదవ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన మొదటి ఇద్దరు విద్యార్థులకు సైకిళ్లను బహుమతిగా అందజేస్తామని తెలిపారు. విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కనిగిరి నియోజకవర్గ జనసేన సాధకులు శానం ఆంజనేయులు, నున్నా శ్రీను తదితరులు పాల్గొన్నారు.