
విశాఖపట్నం: ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన డ్యాన్స్ మాస్టర్ పండుకు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా ఆనందపురం సమీపంలో చోటుచేసుకుంది.
ప్రమాదంలో పండు మాస్టర్ కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆయనను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఈ వార్త తెలిసిన అభిమానులు పండు మాస్టర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.