హిందువుల ఐక్యతతోనే దేశ ఐక్యత సాధ్యం: భజరంగ్ లాల్ భాగ్రా

విజయవాడ: హిందువులంతా ఐక్యంగా ఉన్నప్పుడే భారతదేశం కూడా మరింత బలంగా, ఐక్యంగా ఉండేందుకు అవకాశం ఉంటుందని విశ్వ హిందూ పరిషత్ అఖిల భారతీయ ప్రధాన కార్యదర్శి భజరంగ్ లాల్ భాగ్రా అన్నారు.

విజయవాడ మొగల్రాజపురంలోని విజయవాడ గణేష్ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు చింతల రవికుమార్ (చంటి) నివాసంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భజరంగ్ లాల్ భాగ్రా పాల్గొని పలు అంశాలపై మాట్లాడారు.

భారతదేశంలో హిందూ సమాజం ఎదుర్కొంటున్న జనాభా సంబంధిత అంశాలు, కుటుంబ వ్యవస్థలో వస్తున్న మార్పులు, యువతలో పెరుగుతున్న వివాహాలపై అవగాహన లోపం తదితర అంశాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ బలంగా ఉన్న సమయంలో హిందూ సమాజంలో ఐక్యత మరింత బలంగా ఉండేదని పేర్కొన్నారు.

ప్రస్తుత కాలంలో యువత స్వేచ్ఛాయుత జీవన విధానానికి ప్రాధాన్యత ఇస్తున్నారని, వివాహ వ్యవస్థపై సరైన అవగాహన లేకపోవడం వల్ల కుటుంబాల్లో విభేదాలు పెరిగి విడాకుల వరకు పరిస్థితులు వెళ్తున్నాయని అన్నారు. చిన్న కుటుంబాల వైపు మొగ్గు చూపడం, పిల్లల సంఖ్య తగ్గడం వంటి అంశాలు కూడా హిందూ సమాజ జనాభాపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు.

హిందూ సమాజ జనాభా పరిస్థితిపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. స్వాతంత్ర్యానికి ముందు, అనంతరం వివిధ దేశాల్లో హిందువుల జనాభాలో చోటుచేసుకున్న మార్పులను ఉదాహరణగా ప్రస్తావించారు. హిందువులపై కొన్ని ప్రాంతాల్లో దాడులు పెరుగుతున్నాయని, హిందూ సమాజం ఐక్యతతో సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

హిందూ ధర్మంలో ఉన్న జ్ఞానం, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వారసత్వం అపారమైనవని భజరంగ్ లాల్ భాగ్రా పేర్కొన్నారు. భారతదేశంలోని ప్రాచీన దేవాలయాల నిర్మాణ నైపుణ్యం, వాటి వైభవం ప్రపంచవ్యాప్తంగా నేటికీ ప్రజలను ఆకట్టుకుంటోందని అన్నారు. ఆధునిక ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్‌లు సైతం పురాతన ఆలయాల నిర్మాణ శైలి, సాంకేతికతను పరిశీలించి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

హిందూ సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ వ్యవస్థను పరిరక్షించడంతో పాటు సమాజంలో ఐక్యతను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. హిందువుల ఐక్యత దేశ ఐక్యతకు బలమైన పునాదిగా నిలుస్తుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మా ఆర్ట్స్ వ్యవస్థాపకులు చింతల రామారావు (బాబీ), మా ఆర్ట్స్ సభ్యులు చెన్నుపాటి శ్రీనివాస్, ప్రముఖ వైద్యులు దేవరబోయిన అనిల్ కుమార్, విశ్వ హిందూ పరిషత్ అఖిల భారతీయ సంయుక్త కార్యదర్శి కప్పగంతుల కోటేశ్వర స్వామి, విశ్వ హిందూ పరిషత్ భాగ్యనగర్ క్షేత్ర కార్యదర్శి తనికెళ్ల సత్య రవికుమార్, విశ్వ హిందూ పరిషత్ ఉత్తరాంధ్ర కోశాధ్యక్షులు వలివర్తి దుర్గా ప్రసాద్ రాజు, విజయవాడ గణేష్ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు చింతల రవికుమార్ (చంటి)తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర, జిల్లా, విజయవాడ నగర విభాగాలకు చెందిన విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.