కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు.. పాముల శ్రీవాణికి జనసేన కౌంటర్!

కురుపాం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం యువత అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతుంటే వైసీపీ అనవసర రాద్ధాంతం చేయడం సరికాదని జనసేన పార్టీ నాయకులు ఎల్. రంజిత్ కుమార్, కురుపాం ఏఎంసీ చైర్మన్ గార గౌరీ అన్నారు.

స్థానిక విలేకరులతో వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రజలు కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువతకు మేలు జరిగేలా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యల ఫలితంగా రాష్ట్రంలో పలు ఐటీ సంస్థలు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని చెప్పారు.

జనసేన నాయకుడు ఎల్. రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కురుపాం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని అన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు పూర్తి అవగాహన ఉందని పేర్కొన్నారు.

ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో అనేక గిరిజన గ్రామాల్లో దీర్ఘకాలంగా ఉన్న డోలీ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

డీఎస్సీ విషయంలో కూడా వైసీపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని రంజిత్ కుమార్ స్పష్టం చేశారు. అర్హత సాధించి ఉద్యోగాలు పొందిన అభ్యర్థులపై అనవసర ఆరోపణలు చేయడం వల్ల వారి ఆత్మగౌరవం దెబ్బతింటుందని అన్నారు.

కూటమి ప్రభుత్వం యువత, గిరిజనులు, నిరుద్యోగులు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని జనసేన నాయకులు తెలిపారు. ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేయకుండా వాస్తవాలను ప్రజలకు వివరించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.