
యఱ్ఱగొండపాలెం: పెద్దారవీడు మండలంలోని పెద్దారవీడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి ఎస్.వి.సి.హెచ్. సుబ్రమణ్యం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయిని కనకదుర్గతో కలిసి పాఠశాలలో అమలవుతున్న విద్యాశక్తి, మిషన్ మార్చి-26, ఎస్ఆర్కేవీఎం కిట్స్, మధ్యాహ్న భోజన పథకం తదితర కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు.
పదో తరగతి విద్యార్థుల విద్యా ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎంఈఓ సూచించారు. మిషన్ మార్చి-26 కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజూ విద్యార్థులతో అరగంట పాటు చదివించడంతో పాటు మిగిలిన సమయంలో స్లిప్ టెస్టులు నిర్వహించి, వాటిని మూల్యాంకనం చేయాలని తెలిపారు. పరీక్షల ఫలితాలను విశ్లేషించి రికార్డుల్లో నమోదు చేయాలని సూచించారు. విద్యలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి, వారికి అవసరమైన ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంపై కూడా ఎంఈఓ ప్రత్యేకంగా పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందేలా పాఠశాల సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా ప్రతిరోజూ ఉదయం పాఠశాలలోని ఒక ఉపాధ్యాయుడిని మధ్యాహ్న భోజన పథకం పర్యవేక్షణ కోసం ఆన్లైన్ ద్వారా నామినేట్ చేస్తారని తెలిపారు. సదరు ఉపాధ్యాయుడు మధ్యాహ్న భోజనాన్ని పర్యవేక్షించడంతో పాటు రుచి చూసి, తన అభిప్రాయాన్ని ఆన్లైన్లో నమోదు చేయాలని వివరించారు.
మధ్యాహ్న భోజన పథకం పర్యవేక్షణలో భాగంగా పాఠశాల పరిసరాల పరిశుభ్రత, వంట పాత్రల శుభ్రత, విద్యార్థులు భోజనం చేసే ప్రదేశం, వంటకు ఉపయోగించే పదార్థాల నాణ్యత, సరైన మోతాదులో పదార్థాలను వినియోగిస్తున్నారా లేదా, వండిన ఆహారం రుచికరంగా ఉందా, విద్యార్థులు సంతృప్తిగా భోజనం చేస్తున్నారా అనే అంశాలను పరిశీలించాలని సూచించారు.
అలాగే విద్యాశాఖ ఉన్నతాధికారుల సూచనలను ప్రధానోపాధ్యాయులకు వివరించారు. విద్యార్థులను ఇప్పటి నుంచే జాతీయ ప్రతిభా అన్వేషణ, ఎన్ఎంఎంఎస్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధం చేయాలని తెలిపారు. ఎస్ఆర్కేవీఎం కార్యక్రమానికి సంబంధించి విద్యార్థులందరి బయోమెట్రిక్ ధ్రువీకరణను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
తనిఖీ సమయంలో పాఠశాలలోని అన్ని తరగతి గదుల్లో ఉపాధ్యాయులు హాజరై విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధిస్తున్న తీరుపై ఎంఈఓ సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యాబోధన సక్రమంగా కొనసాగుతున్నందుకు ప్రధానోపాధ్యాయిని, ఉపాధ్యాయులు, సిబ్బందిని అభినందించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు సమష్టిగా కృషి చేయాలని సూచించారు.