
ఏలూరు–కన్నాపురం: గోదావరి లోయ ప్రతిఘటనోద్యమ నేత కామ్రేడ్ సీతక్క మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె మృతి విషయం తెలుసుకున్న ఏపీఎస్‌ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి రెడ్డి అప్పలనాయుడు బుధవారం కన్నాపురంలోని సీతక్క నివాసానికి వెళ్లి ఆమె భౌతికకాయాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా కామ్రేడ్ సీతక్కకు విప్లవ జోహార్లు అర్పిస్తూ ఘనంగా నివాళులర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం సీతక్క కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
కామ్రేడ్ సీతక్క భౌతికకాయానికి ఐఎఫ్‌టీయూ కేంద్ర కార్యదర్శి పి. ప్రసాద్, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి యు. వెంకటేశ్వరరావు, బీఓసీ కార్యదర్శి బద్ద వెంకట్రావు, మార్కెట్ యార్డ్ కార్యదర్శి యర్రా శ్రీనివాసరావు, ఏలూరు మార్కెట్ యార్డ్ నిమ్మ విభాగం కోశాధికారి దనాన విజయ్, ఏలూరు మార్కెట్ యార్డ్ కోశాధికారి మీసాల వెంకటరమణ తదితరులు నివాళులర్పించారు.
అలాగే సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కమిటీ సభ్యులు సీతక్క భౌతికకాయాన్ని సందర్శించి విప్లవ జోహార్లు అర్పించారు. ఆమెతో ఉన్న అనుబంధాన్ని, ఉద్యమంలో ఆమె అందించిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.