
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పేపర్ లీకేజీ ఘటనలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. నిందితులకు వేగంగా శిక్షలు పడేలా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన కొద్ది గంటల్లోనే కార్యాచరణ ప్రారంభించింది.
నీట్ పేపర్ లీకేజీ కేసులో నిందితులపై ప్రజా పరీక్షల్లో అక్రమాల నివారణ చట్టం–2024 కింద విచారణ చేపట్టనున్నారు. ఈ చట్టం ప్రకారం దోషులుగా తేలిన వారికి గరిష్ఠంగా ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
మొదటి దశలో బాంబే, కలకత్తా, ఢిల్లీ, మధ్యప్రదేశ్ హైకోర్టుల పరిధిలో ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న నాలుగు కేసులను ఈ కోర్టులకు బదిలీ చేసి రోజువారీ విచారణ నిర్వహించేలా చర్యలు తీసుకోనుంది.
నీట్ పేపర్ లీక్‌కు సంబంధించి ఇప్పటికే నాలుగు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. వీటిలో రెండు కేసులు బాంబే హైకోర్టు పరిధిలో ఉన్నాయి. ఈ కేసుల వేగవంతమైన విచారణ కోసం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, హైకోర్టులను కేంద్రం అధికారికంగా కోరనుంది.
నీట్‌తో పాటు యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, ఐబీపీఎస్ తదితర కేంద్ర ప్రభుత్వ పోటీ పరీక్షలకు సంబంధించిన పేపర్ లీకేజీ కేసులు కూడా ఈ కొత్త చట్టం పరిధిలోకి వస్తాయని కేంద్రం స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ, యువత భవిష్యత్తు, సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. యువత భవిష్యత్తుతో చెలగాటమాడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, వారికి కఠిన శిక్షలు పడేలా ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ద్వారా వేగంగా న్యాయం అందిస్తామని స్పష్టం చేశారు.