
ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రవ్యాప్తంగా హస్తకళాకారుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఉచిత వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం పాలకొల్లు నియోజకవర్గంలోని యలమంచిలిలో క్రోచెట్ లేస్ కళాకారుల కోసం ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఈ శిబిరంలో మొత్తం 217 మంది కళాకారులకు కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో ఐదుగురికి శుక్లాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించగా, 187 మందికి కళ్లద్దాలు అవసరమని నిర్ధారించారు. వారికి త్వరలోనే ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేయనున్నారు.
గత వారం నరసాపురంలో నిర్వహించిన ఇలాంటి వైద్య శిబిరంలో కంటి చూపు సమస్యలు ఉన్న 142 మంది హస్తకళాకారులకు కూడా ఉచిత కళ్లద్దాలు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. హస్తకళాకారుల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఈ వైద్య శిబిరాలను కొనసాగిస్తోంది.