పవన్ కళ్యాణ్‌పై విమర్శలు రాజకీయ ఉనికి కోసం చేస్తున్న ప్రయత్నమే: అంకె ఈశ్వరయ్య

అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై తెలంగాణకు చెందిన కొందరు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలు రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాల్మీకి బోయ వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, జనసేన పార్టీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య విమర్శించారు.

ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ కాంగ్రెస్ నేతలు పొన్నం ప్రభాకర్, అద్దంకి దయాకర్, మందుల శామ్యూల్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

రాష్ట్రాల అభివృద్ధి, పరిపాలన, ప్రజా సంక్షేమ అంశాలపై చర్చ జరగాల్సిన సమయంలో వ్యక్తిగత విమర్శలు, రాజకీయ దూషణలకు దిగడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడిపై ఆధారరహిత ఆరోపణలు చేయడం ద్వారా కొందరు రాజకీయ నాయకులు తాత్కాలిక ప్రచారం పొందాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి సామాజిక బాధ్యత, పారదర్శకత, ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నారని, అలాంటి నాయకుడిపై అసత్య ప్రచారం చేయడం వెనుక రాజకీయ స్వార్థం తప్ప మరే ఉద్దేశం లేదన్నారు.

తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొందరు నాయకులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై అనవసరంగా స్పందించడం వెనుక రాజకీయ ప్రయోజనాలే ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఒక రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న నాయకుడిపై మరో రాష్ట్రానికి చెందిన నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రజల్లో అసహనాన్ని పెంచుతుందని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తన శాఖల ద్వారా తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు చేరువవుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో రాజకీయంగా ఎదుర్కోలేని నాయకులు వ్యక్తిగత విమర్శల ద్వారా తమ రాజకీయ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

ప్రజలు ఇప్పుడు రాజకీయ ఆరోపణలను కాకుండా నాయకుల పనితీరును గమనిస్తున్నారని, అందువల్ల అసత్య ప్రచారాలకు ఎలాంటి ప్రాధాన్యత లేదన్నారు. పవన్ కళ్యాణ్ ప్రజా జీవితంలో చేసిన సేవలు, విపత్తుల సమయంలో అందించిన సహాయం, యువతలో కలిగించిన చైతన్యం, రాజకీయాల్లో తీసుకొచ్చిన మార్పులను గుర్తు చేసుకోవాలని సూచించారు.

ప్రజల మద్దతుతో ఎదిగిన నాయకుడిని విమర్శల ద్వారా బలహీనపరచాలని చేసే ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించవని, అలాంటి రాజకీయ ధోరణిని ప్రజలే తిప్పికొడతారని స్పష్టం చేశారు. రాజకీయాల్లో విమర్శలు అంశాల ఆధారంగా ఉండాలని, వ్యక్తిగత స్థాయికి దిగజారడం సమాజానికి మంచిది కాదన్నారు.

పవన్ కళ్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సంబంధిత నాయకులకు సూచించిన అంకె ఈశ్వరయ్య, ప్రజాస్వామ్యంలో పరస్పర గౌరవం, హుందాతనం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. అలాంటి విలువలను విస్మరించే రాజకీయ వ్యాఖ్యలు చివరకు ప్రజల చీత్కారానికి గురవుతాయని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.