
ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ‘లేపాక్షి’ ప్రత్యేక క్యూ ఆర్ కోడ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు రూపొందించిన ఈ వ్యవస్థ ద్వారా ప్రతి హస్తకళా ఉత్పత్తికి డిజిటల్ గుర్తింపు కల్పించనున్నారు. దేశంలోనే తొలిసారిగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కళాఖండంపై ఉన్న క్యూ ఆర్ కోడ్‌ను మొబైల్‌తో స్కాన్ చేస్తే ఆ ఉత్పత్తి చరిత్ర, సాంస్కృతిక విశిష్టత, తయారు చేసిన కళాకారుడి వివరాలు, తయారీకి ఉపయోగించిన ముడిసరుకు, పట్టిన సమయం, వస్తువు కొలతలు, భౌగోళిక గుర్తింపు (జీఐ), ‘ఒక జిల్లా–ఒక ఉత్పత్తి’ (ఓడీఓపీ) గుర్తింపు వంటి వివరాలు వెంటనే అందుబాటులోకి వస్తాయి. దీంతో వినియోగదారులకు ఉత్పత్తి ప్రామాణికతపై స్పష్టమైన సమాచారం లభించనుంది.
తొలి దశలో బొబ్బిలి వీణ, కలంకారి చిత్రాలు (సంపూర్ణ రామాయణం, మహాభారతం, శ్రీకృష్ణలీల, మత్స్యావతారం), సవర ఆదివాసి చిత్రకళ తదితర ఎనిమిది ప్రముఖ హస్తకళా ఉత్పత్తులకు క్యూ ఆర్ కోడ్ ప్రొఫైళ్లు రూపొందించారు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని హస్తకళా ఉత్పత్తులు, కళాకారుల క్లస్టర్లకు ఈ విధానాన్ని విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా నకిలీ ఉత్పత్తులను నియంత్రించడంతో పాటు, హస్తకళలకు ప్రపంచ మార్కెట్‌లో మరింత గుర్తింపు లభించడం, కళాకారులకు తగిన గుర్తింపు దక్కడం, వారి ఆదాయం పెరగడం వంటి ప్రయోజనాలు కలుగుతాయని అధికారులు భావిస్తున్నారు.