
వ్యక్తిగత పర్యటన నిమిత్తం సింగపూర్‌కు వెళ్లిన పెందుర్తి శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబుకు అక్కడి జనసైనికులు ఘన స్వాగతం పలికి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వ్యక్తిగత పర్యటనలో ఉన్నప్పటికీ పార్టీ శ్రేణుల అభ్యర్థన మేరకు సమయం కేటాయించి వారితో సమావేశమైన ఆయనను కార్యకర్తలు అభినందించారు.
ఈ సందర్భంగా సింగపూర్ ఏపీ ఎన్ఆర్టీ కంట్రీ కో-ఆర్డినేటర్ బైలపూడి గౌరీ వరలక్ష్మి ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి పెందుర్తి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. విదేశాల్లో ఉన్నప్పటికీ స్వరాష్ట్ర అభివృద్ధిపై తనకు ప్రత్యేక ఆసక్తి ఉందని పేర్కొంటూ, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రశంసించారు.
రహదారుల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రజలకు అందుతున్న సేవలను కొనియాడిన గౌరీ వరలక్ష్మి, పెందుర్తి అభివృద్ధికి ఎమ్మెల్యే చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. విదేశాల్లో ఉన్న తెలుగు వారు కూడా తమ ప్రాంత అభివృద్ధికి సహకరించాలని, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాస భారతీయుల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు. విదేశాల్లో జనసేన పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా తీసుకెళ్తూ పార్టీకి అండగా నిలుస్తున్న సింగపూర్ జనసైనికుల సేవలను అభినందించారు. పార్టీ బలోపేతం, పెందుర్తి నియోజకవర్గ అభివృద్ధి కోసం అందరూ సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.
సమావేశంలో సింగపూర్ జనసైనికులు తమ అభిప్రాయాలు, సూచనలను ఎమ్మెల్యేతో పంచుకోగా, ఆయన వాటిని శ్రద్ధగా ఆలకించారు. విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజల తరఫున రాష్ట్ర అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని బైలపూడి గౌరీ వరలక్ష్మి తెలిపారు.
ఈ కార్యక్రమంలో సింగపూర్‌లో నివసిస్తున్న పెందుర్తి నియోజకవర్గానికి చెందిన జనసైనికులు, తెలుగు ప్రముఖులు పాల్గొన్నారు.