ఎన్‌హెచ్-216 పనుల్లో జాప్యంపై కలెక్టర్ హెచ్చరిక

అమలాపురం: జాతీయ రహదారి-216 విస్తరణలో భాగంగా చేపట్టిన 132 కేవీ ట్రాన్స్‌మిషన్ లైన్ తరలింపు పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ ఏపీ ట్రాన్స్‌కో, జాతీయ రహదారుల అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.

జిల్లాలో మొత్తం ఎనిమిది 132 కేవీ ట్రాన్స్‌మిషన్ టవర్లు ప్రభావితమవుతున్నాయని, వాటిలో రెండు మామిడికుదురు మండలంలో, ఆరు రాజోలు మండల పరిధిలో ఉన్నాయని తెలిపారు. టవర్లు, ట్రాన్స్‌మిషన్ కారిడార్ల మార్పిడి వల్ల భూములు కోల్పోయిన యజమానులకు నష్టపరిహారం చెల్లించే ప్రక్రియను వేగవంతం చేయాలని జాతీయ రహదారుల విభాగం అధికారులకు సూచించారు.

ఏపీ ట్రాన్స్‌కో, జాతీయ రహదారుల అధికారులు పరస్పర సమన్వయంతో కార్యాచరణ రూపొందించి పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పనుల్లో జాప్యం లేదా నిర్లక్ష్యం ప్రదర్శిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పనులు పూర్తి చేసి, ఎన్‌హెచ్-216 విస్తరణకు ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

సమావేశంలో అమలాపురం ఆర్డీవో ఎ. సరళావతి, ఆర్‌అండ్‌బీ జాతీయ రహదారుల విభాగం అధికారులు, ఏపీ ట్రాన్స్‌కో అధికారులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.