ప్రజల్లోనే జనసేన బలం.. క్షేత్రస్థాయిలో మరింత చురుగ్గా పనిచేయాలి: పవన్ కళ్యాణ్

విజయవాడ: జనసేన పార్టీ కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా క్షేత్రస్థాయిలో నిరంతరం నిర్వహించడం తక్షణ కర్తవ్యమని పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గురువారం రాత్రి విజయవాడలో నిర్వహించిన జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో సమావేశమైన ఆయన పార్టీ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. పార్టీ నుంచి ఎన్నికైన ప్రతి ప్రజాప్రతినిధి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని, ప్రజలు జనసేనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టేలా పనిచేయాలని అన్నారు.

ప్రజలతో పాటు పార్టీ శ్రేణులతో కూడా మరింత మమేకం కావడం ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి వీర మహిళ, జనసైనికుడికి అండగా నిలిచి వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకుని భరోసా కల్పించాలని సూచించారు.

పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి విడుదలయ్యే కార్యక్రమాల షెడ్యూల్‌ను తప్పనిసరిగా అమలు చేయాలని, క్షేత్రస్థాయి నుంచి ప్రజలు, పార్టీ శ్రేణుల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌ను ఎప్పటికప్పుడు పార్టీ నాయకత్వానికి అందించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.

సమావేశంలో జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కార్యక్రమంలో పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులుగా పనిచేసిన ప్రజాప్రతినిధులు తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిన పరిశీలకులు, కమిటీ సభ్యులను పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సమావేశంలో పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీలు వి. బాలశౌరి, టి. ఉదయ్ శ్రీనివాస్, లింగమనేని రమేష్, ఎమ్మెల్సీలు నాగబాబు, పిడుగు హరిప్రసాద్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.