
అమరావతి: రోడ్ల నాణ్యతలో ఆంధ్రప్రదేశ్ గణనీయమైన పురోగతి సాధించింది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ నిర్వహించిన తనిఖీల్లో రాష్ట్రం దేశవ్యాప్తంగా రెండో స్థానాన్ని దక్కించుకుంది. గతంలో 2021-22లో 19వ స్థానంలో ఉన్న ఏపీ, ప్రస్తుతం అగ్రస్థానాలకు చేరడం విశేషంగా నిలిచింది.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత రోడ్ల నిర్మాణంలో నాణ్యతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. నిర్మాణ దశలోనే క్వాలిటీ కంట్రోల్ సిబ్బందితో నిరంతర తనిఖీలు నిర్వహించే విధానాన్ని అమలు చేయడంతో రహదారుల నాణ్యత గణనీయంగా మెరుగుపడింది.
ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్వై) కింద 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు చేపట్టిన పనులను కేంద్ర బృందం పరిశీలించింది. దేశవ్యాప్తంగా 2,948 రహదారులను తనిఖీ చేయగా, 441 రహదారులు నాణ్యత ప్రమాణాలకు తగ్గట్టుగా లేవని గుర్తించారు. అయితే ఆంధ్రప్రదేశ్లో పరిశీలించిన 126 రహదారుల్లో కేవలం ఒక్క రహదారి మాత్రమే నాణ్యత తక్కువగా ఉందని నివేదిక వెల్లడించింది.
ఈ ర్యాంకింగ్స్లో గుజరాత్ తొలి స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానాన్ని దక్కించుకుంది. మధ్యప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్ తదుపరి స్థానాల్లో నిలిచాయి. దీంతో రాష్ట్రంలో రహదారుల నాణ్యత పెంపులో తీసుకున్న చర్యలు ఫలిస్తున్నాయని స్పష్టమైంది.