ఏపీ ఎయిమ్స్-2.0 పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

మార్కాపురం : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీ ఎయిమ్స్-2.0 యాప్ ద్వారా రైతులకు ఎరువుల పంపిణీ ప్రక్రియ మరింత పారదర్శకంగా, సులభతరంగా నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత తెలిపారు.

మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లో వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఏపీ ఎయిమ్స్-2.0 యాప్‌కు సంబంధించిన పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులు నమోదు చేసిన పంట వివరాలు, సాగు విస్తీర్ణం ఆధారంగా యూరియా, డీఏపీ తదితర ఎరువుల కేటాయింపులు యాప్‌లో స్పష్టంగా అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఎరువుల పంపిణీ సమయంలో రైతుల ఆధార్ నంబర్ ఆధారంగా పంట వివరాలను పరిశీలించి కేటాయింపులు అమలు చేస్తారని వివరించారు.

రైతులకు కేటాయించిన ఎరువులు సాధారణంగా మూడు విడతలుగా యాప్‌లో చూపించబడతాయని, ఎరువుల నిల్వలను బట్టి తొలి విడతలో పంపిణీ చేపడతారని తెలిపారు. మొత్తం కేటాయింపు మూడు బస్తాలు లేదా అంతకంటే తక్కువగా ఉంటే ఒకే విడతలో ఎరువులు పంపిణీ పూర్తవుతుందని పేర్కొన్నారు.

ఎరువులు స్వీకరించిన అనంతరం రైతులు తప్పనిసరిగా పీఓఎస్ (POS) యంత్రంలో బయోమెట్రిక్ నమోదు చేయించుకోవాలని సూచించారు. ఈ విధానం ద్వారా ఎరువుల పంపిణీలో పారదర్శకత పెరగడంతో పాటు రైతులకు వేగవంతమైన, సమర్థవంతమైన సేవలు అందుతాయని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ ఇన్‌చార్జి అధికారి బాలాజీ నాయక్‌తో పాటు వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.