
రాజన్న కాలనీలో నివాస ప్రాంతానికి సమీపంలో కొనసాగుతున్న డంపింగ్ యార్డ్‌ను తక్షణమే తరలించాలని డిమాండ్ చేస్తూ స్థానిక ప్రజలు చేపట్టిన నిరసన ఉద్యమం ఆదివారం 80వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నిరసన శిబిరంలో ఎస్.కోట జనసేన నాయకులు వబ్బిన సన్యాసి నాయుడు, మొగ్గ ప్రశాంత్, గారి గోపి, వి. శ్రీను, ఎ. నారాయణరావు, వి. ఈశ్వరరావు, బి. సతీష్ తదితరులు పాల్గొని ప్రజలకు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ నుంచి వెలువడుతున్న దుర్వాసన, కాలుష్యం కారణంగా చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గత 80 రోజులుగా ప్రజలు శాంతియుతంగా నిరసనలు కొనసాగిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోకపోవడం విచారకరమని పేర్కొన్నారు.
కొత్తవలస సర్వే నంబర్ 173, చీపురువలస సర్వే నంబర్ 175లో ప్రత్యామ్నాయ ప్రభుత్వ స్థలాలను అధికారులు ఇప్పటికే పరిశీలించినప్పటికీ డంపింగ్ యార్డ్ తరలింపుపై ఇప్పటివరకు స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
కాలుష్య నియంత్రణ మండలి డంపింగ్ యార్డ్ తరలింపునకు సంబంధించి నోటీసులు జారీ చేసినప్పటికీ వాటి అమలులో నిర్లక్ష్యం కొనసాగుతోందని విమర్శించారు. గత ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడంలో విఫలమైందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేలా డంపింగ్ యార్డ్‌ను తరలించాలని డిమాండ్ చేశారు.
డంపింగ్ యార్డ్ తరలింపుపై తక్షణ చర్యలు ప్రారంభించకపోతే ప్రజలతో కలిసి రాస్తారోకోలు, ధర్నాలు, ప్రభుత్వ కార్యాలయాల ముట్టడులు వంటి మరింత ఉధృతమైన ఆందోళన కార్యక్రమాలు చేపడతామని నిరసనకారులు హెచ్చరించారు.