కుల రాజకీయాలు, శవ రాజకీయాలు మానుకోవాలి: ఎమ్మెల్యే బడేటి చంటి, రెడ్డి అప్పలనాయుడు

రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా దానిని కుల రాజకీయాలు, శవ రాజకీయాలకు వేదికగా మార్చడం వైసీపీ రాజకీయ సంస్కృతిగా మారిందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఆర్టీసీ విజయవాడ జోన్-2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. తప్పుడు ప్రచారాలను విషంలా కూటమి ప్రభుత్వంపై చల్లేందుకు వైసీపీ నాయకులు వెనుకాడడం లేదని ఆరోపించారు.

ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సాయికృష్ణ మిస్సింగ్ కేసు అంశంలో వైసీపీ అవలంబిస్తున్న రాజకీయ వైఖరిని ఖండించారు.

ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఈ వ్యవహారంలో వైసీపీ మరోసారి తన రాజకీయ ధోరణిని బయటపెట్టిందన్నారు. కులాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. గతంలో ఇలాంటి రాజకీయాల కారణంగానే ప్రజలు వైసీపీకి గట్టి తీర్పు ఇచ్చారని, ఇప్పటికీ అదే విధానాన్ని కొనసాగిస్తే ప్రజలే మరోసారి తగిన సమాధానం చెబుతారని అన్నారు.

ఆర్టీసీ విజయవాడ జోన్-2 చైర్మన్, ఏలూరు జనసేన ఇంచార్జి రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో మొదట స్పందించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు సంబంధిత సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నాగరాజును సస్పెండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

సాయికృష్ణ మృతి ఘటనపై ప్రత్యేక కమిటీతో విచారణ జరిపించి చట్టం ముందు అందరూ సమానమే అన్న సూత్రంతో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. బాధితుడి తల్లి, మేనమామ అందించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని నిష్పక్షపాత విచారణ జరిపి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.

ఇకనైనా వైసీపీ నాయకులు కుల రాజకీయాలు, శవ రాజకీయాలు మానుకుని ప్రజా సమస్యలపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని బడేటి చంటి, రెడ్డి అప్పలనాయుడు కోరారు.

ఈ మీడియా సమావేశంలో ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివ ప్రసాద్, టీడీపీ నగర అధ్యక్షుడు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, నాయకుడు ఆర్నేపల్లి తిరుపతిరావుతో పాటు కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.