
మార్కాపురం : జీఎఫ్ఎల్ఎన్ (ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ) శిక్షణా కార్యక్రమాలను నియోజకవర్గ కేంద్రాల వద్ద కాకుండా ఆయా మండల కేంద్రాల్లోనే నిర్వహించాలని యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (యూటీఎఫ్) జిల్లా శాఖ కోరింది. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీతకు యూటీఎఫ్ ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా యూటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ, ప్రస్తుతం కొనసాగుతున్న వేసవి తీవ్రత కారణంగా ఉపాధ్యాయులు దూర ప్రాంతాలకు ప్రయాణించడం కష్టసాధ్యంగా మారిందని తెలిపారు. కొన్ని మండలాలకు చెందిన ఉపాధ్యాయులు సుమారు 50 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి శిక్షణా కేంద్రాలకు చేరుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. తగిన రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల మరింత ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అందువల్ల ప్రతి మండల కేంద్రంలోనే శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని, అది సాధ్యం కాకపోతే ఉపాధ్యాయులు తమకు అనుకూలమైన శిక్షణా కేంద్రాన్ని ఎంపిక చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు.
ఈ విషయంపై జిల్లా కలెక్టర్ విజయ సునీత సానుకూలంగా స్పందించి, సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు యూటీఎఫ్ ప్రతినిధులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఒద్దుల వీరారెడ్డి, కోశాధికారి బి. శ్రీరాములు, ఆడిట్ కమిటీ కన్వీనర్ పి. ప్రభాకర్, జిల్లా కార్యదర్శి వై. పాపయ్య, జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు యు. వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.