జూన్ 5 నుంచి ఇబ్రహీంపట్నంలో ‘కృష్ణవేణి నదీ నవహారతులు’ పునఃప్రారంభం

విజయవాడ : సనాతన హిందూ ధర్మ ప్రచారం, టెంపుల్ టూరిజం అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం (ఫెర్రీ ఘాట్) వద్ద నిర్వహించే ‘కృష్ణవేణి నదీ నవహారతులు’ కార్యక్రమాన్ని ఘనంగా పునఃప్రారంభించేందుకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం సన్నాహాలు ప్రారంభించింది.

వచ్చే నెల జూన్ 5, 2026 నుంచి ఈ నవహారతుల కార్యక్రమాన్ని వైభవంగా పునఃప్రారంభించి నిరంతరాయంగా నిర్వహించేందుకు దేవస్థానం చర్యలు చేపట్టింది.

ఈ సందర్భంగా నవహారతుల నిర్వహణను శాస్త్రోక్తంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు అవసరమైన సూచనలు, సలహాలను లిఖితపూర్వకంగా అందజేయాలని ఆలయ స్థానాచార్యులు, వైదిక కమిటీ సభ్యులకు దేవస్థానం ఈవో వి.కె. శీనా నాయక్ ఆదేశాలు జారీ చేశారు.

క్షేత్రస్థాయి పరిశీలనకు ఆదేశాలు

పవిత్ర సంగమం వద్ద నవహారతుల నిర్వహణకు అవసరమైన వసతులు, భద్రతా ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలపై సమగ్ర పరిశీలన నిర్వహించాలని దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, సహాయ కమిషనర్, పౌరసంబంధాల అధికారి, వైదిక కమిటీ సభ్యులకు ఈవో సూచించారు.

క్షేత్రస్థాయిలో అన్ని అంశాలను పరిశీలించి జూన్ 2, 2026 లోపు సమగ్ర నివేదిక (Comprehensive Report) సమర్పించాలని సంబంధిత అధికారులకు గడువు విధించారు.

భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి

పవిత్ర కృష్ణానదికి సమర్పించే ఈ నవహారతుల కార్యక్రమం భక్తులు, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేలా ఉండాలని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఈవో శీనా నాయక్ అధికారులను ఆదేశించారు.

కృష్ణమ్మ తల్లికి సమర్పించే ఈ దివ్య హారతులు ఆధ్యాత్మికత, సాంప్రదాయం, పర్యాటకాభివృద్ధికి ప్రతీకగా నిలుస్తాయని దేవస్థానం అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.