
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య సేవల బలోపేతం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం మరో కీలక చర్య చేపట్టింది. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు పరిధిలోని ప్రైవేట్ ఆసుపత్రుల బకాయిల చెల్లింపుల కోసం ప్రభుత్వం రూ. 919.13 కోట్లను విడుదల చేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ట్రై-పార్టీ బిల్ డిస్కౌంటింగ్ విధానం ద్వారా ఈ నిధులను నేరుగా సంబంధిత ఆసుపత్రుల ఖాతాల్లో జమ చేసినట్లు ఆయన వివరించారు. ఏపీ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ వెబ్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకున్న 785 ప్రైవేట్ ఆసుపత్రులకు ఈ నిధులు అందినట్లు పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు ప్రైవేట్ ఆసుపత్రులకు మొత్తం రూ. 5,556 కోట్ల బకాయిలను చెల్లించినట్లు మంత్రి తెలిపారు. బకాయిల చెల్లింపుల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఈ చెల్లింపులకు సంబంధించిన నివేదికను ట్రస్టు సీఈఓ చక్రధరబాబు మంత్రికి అందజేసినట్లు సమాచారం.