రేవంత్ బీజేపీలో చేరొచ్చంటూ అరవింద్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశం ఉందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ చేసిన “రేవంత్ రెడ్డి.. నాతో కలవండి” అనే వ్యాఖ్యల వెనుక రాజకీయ అర్థాలు ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లో సువేందు అధికారి పార్టీ మారిన విధంగానే రేవంత్ కూడా రాజకీయంగా కొత్త నిర్ణయం తీసుకునే అవకాశముందని విశ్లేషించారు.

సోమవారం నిజామాబాద్‌లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అరవింద్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, రేవంత్ రెడ్డి మధ్య ఎలాంటి రాజకీయ అవగాహన ఉందో తనకు తెలియదని, తాను బీజేపీలో ఒక సాధారణ కార్యకర్తనని పేర్కొన్నారు.

టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ అధిష్ఠానం సొంత పార్టీ సీనియర్ నేతలను నిర్లక్ష్యం చేసిందని అరవింద్ విమర్శించారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు వంటి నేతలకు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

రేవంత్ రెడ్డి రాజకీయంగా ఎప్పుడు ఎటువైపు వెళ్తారో చెప్పలేని పరిస్థితి ఉందని, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈ విషయంపై ఆలోచించాలని సూచించారు. అలాగే, 2039 వరకు రాహుల్ గాంధీ ప్రధాని కాలేరని రేవంత్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, మరో పదేళ్ల పాటు నరేంద్ర మోదీనే ప్రధానిగా కొనసాగుతారని రేవంత్ పరోక్షంగా చెప్పినట్లుగా ఉందని అరవింద్ వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.