
అరకు: చింతపల్లి పరిధిలో పాస్టర్ అభినయ్ దర్శన్‌పై హత్యాయత్నం జరిగినట్లు నమోదైన కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. తనపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని, తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నానని అతను చేసిన ప్రచారం మొత్తం నాటకమని పోలీసులు నిర్ధారించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆధ్వర్యంలో లోతైన విచారణ చేపట్టారు. విచారణలో అసలు దాడి జరగలేదని, ఇది ముందస్తు ప్రణాళికతో సృష్టించిన హైడ్రామా అని తేలింది.
సింపతీ పొందడం మరియు వ్యక్తిగత కారణాల కోసం ఈ నాటకం ఆడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో అభినయ్ దర్శన్‌కు మరో ఆరుగురు సహకరించినట్లు కూడా దర్యాప్తులో వెల్లడైంది.
అతని ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు సంబంధించిన ఆడియోలు, వీడియో చాట్లు, అలాగే వైద్య నివేదికలను పరిశీలించిన తరువాత ఇది ఫేక్ అటాక్ అని స్పష్టమైంది. దాడి జరిగిందని నమ్మించే ప్రయత్నం చేసిన అభినయ్ దర్శన్ మరియు సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.