మత్స్య ఉత్పత్తుల మార్కెటింగ్‌కు మేనేజర్‌లా పనిచేస్తా: సీఎం చంద్రబాబు

కావలి నియోజకవర్గం: తుమ్మలపెంట గ్రామంలో నిర్వహించిన ‘మత్స్యకారుల సేవలో’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మత్స్యకారుల ఉత్పత్తులకు మార్కెటింగ్ మద్దతు ఇవ్వడంలో తాను వ్యక్తిగతంగా మార్కెటింగ్ మేనేజర్‌లా వ్యవహరిస్తానని హామీ ఇచ్చారు.

చేపలు కేవలం వేటకే పరిమితం కాకుండా వాటికి ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందని, ఆ అవకాశాన్ని మత్స్యకారుల అభివృద్ధికి వినియోగిస్తామని చెప్పారు. ఆధునిక సాంకేతికత, కొత్త ఆదాయ మార్గాలతో మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా చేపల వేట నిషేధ కాలానికి సంబంధించి 1,30,796 మత్స్యకార కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 20,000 చొప్పున మొత్తం రూ. 261.50 కోట్ల ఆర్థిక సాయాన్ని ఆయన బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు. డబ్బులు జమ అయిన సందేశాలు వెంటనే లబ్ధిదారుల మొబైళ్లకు రావడంతో వారు హర్షం వ్యక్తం చేశారు.

మత్స్యకారుల హక్కులు, వనరులపై పూర్తి అధికారం తమదేనని సీఎం పేర్కొన్నారు. తీర ప్రాంతంలో గస్తీ పెంచి పొరుగు రాష్ట్రాల బోట్లు రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రిజర్వాయర్లు, చెరువుల్లో చేపల పెంపకాన్ని మత్స్యకారులకే అప్పగించినట్లు తెలిపారు.

మహిళల ఆర్థిక స్వావలంబన కోసం సీవీడ్ సాగును ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు. తీర ప్రాంత అభివృద్ధి, హార్బర్ నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పనపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు.

గత పాలనపై విమర్శలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.