
అమరావతి: సంక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టి పరస్పరం ముడిపడి ఉన్న అంశాలని, ఈ మూడు సమన్వయంతో ముందుకు సాగితేనే రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలపగలమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతి సచివాలయంలో ప్రారంభమైన రెండు రోజుల 7వ జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన స్పష్టమైన కార్యాచరణను వివరించారు.
గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రంపై భారీ ఆర్థిక భారం పడిందని పేర్కొంటూ, రూ.9.74 లక్షల కోట్ల అప్పులు, రూ.1.30 లక్షల కోట్ల పెండింగ్ బిల్లులు వారసత్వంగా వచ్చాయని తెలిపారు. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను దారి మళ్లించడం వల్ల రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. అయితే అందరి సహకారంతో వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టగలిగామని చెప్పారు.
డబ్బుల కొరతను కారణంగా చూపకుండా సంపద సృష్టిపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించిన సీఎం, సంక్షేమం కొనసాగాలంటే అభివృద్ధి అవసరమని, అభివృద్ధికి సంపద సృష్టి కీలకమని వివరించారు. సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు భరోసా కల్పించామని, ఇప్పుడు పారిశ్రామిక ప్రగతితో రాష్ట్ర ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తున్నామని తెలిపారు.
రాష్ట్రానికి భారీ పరిశ్రమలు, అంతర్జాతీయ సంస్థలు వస్తున్నాయని పేర్కొంటూ, ఇప్పటికే రూ.23 లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు కుదిరాయని చెప్పారు. అవి కార్యరూపం దాల్చితే సుమారు 24 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ వంటి సంస్థలు ఏపీపై ఆసక్తి చూపుతున్నాయని, గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో రాష్ట్రం వేగంగా ముందుకు సాగుతోందన్నారు.
పాలనలో వేగం, జవాబుదారీతనం అత్యంత ముఖ్యమని పేర్కొంటూ, “ఫైళ్లు కాదు.. ఫలితాలు కదలాలి” అనే విధానంతో అధికారులు పనిచేయాలని సీఎం సూచించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని ఆదేశించారు.
అలాగే క్షేత్రస్థాయి పర్యటనలకు ప్రాధాన్యం ఇవ్వాలని, కార్యదర్శులు, విభాగాధిపతులు, కలెక్టర్లు నిర్దిష్ట రోజుల పాటు ప్రజల్లో ఉండాలని సూచించారు. జిల్లాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని, ఒక జిల్లాలో అమలైన ఉత్తమ విధానాలను ఇతర జిల్లాల్లోనూ అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు.