
మార్కాపురం జిల్లాలో రాబోయే 6 నెలల్లో రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వస్తున్న అర్జీలలో సుమారు 90 శాతం రెవెన్యూ సంబంధిత సమస్యలేనని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని ఆమె వివరించారు.
జిల్లాలో 22ఏలో నమోదైన సర్వే నెంబర్ల తొలగింపుకు సంబంధించి ఇప్పటివరకు 450 అర్జీలు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. అలాగే 21 మండలాలకు చెందిన 150 మంది రైతుల భూములను ప్రత్యేక శ్రద్ధతో పరిశీలించి 22ఏ నుండి తొలగించి, వారికి ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు.
పొరపాటున 22ఏలో నమోదైన భూములపై రైతులు తమ సచివాలయాల ద్వారా అర్జీలు దాఖలు చేసి సమస్యలను పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, జిల్లా పంచాయతీ అధికారి బాలు నాయక్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.