పెద్ద పులి సంచారంపై హనుమాన్ బృందాల అప్రమత్తత

• సురక్షితంగా బంధించేందుకు 10 బృందాల నియామకం
• పులి సంచారంపై రేడియో కాలర్ ట్రాకింగ్ సిస్టం సందేశం
• పట్టుకుని విశాఖ జూలో వదలాలని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశం

రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జనావాసాల మధ్య సంచరించి ప్రజలను భయభ్రాంతులకి గురి చేసిన పెద్ద పులి మరోసారి జనావాసాలకు సమీపంగా వస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. గత నెలలో కూర్మాపురం వద్ద బంధించి- నిపుణుల సూచన మేరకు పులి మెడలో రేడియో కాలర్ వేసి సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టగా అది తిరిగి జనావాసల వైపు అడుగులు వేస్తోంది. ఈ మేరకు అటవీశాఖ అధికారులకు రేడియో కాలర్ ట్రాకింగ్ సిస్టం నుంచి సందేశం అందగా, విషయాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువచ్చారు. విషయం తెలిసిన వెంటనే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ‘హనుమాన్’ బృందాలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. పులి కదలికలను ఎప్పటికప్పుడు అంచనా వేసి దాన్ని సురక్షితంగా బంధించి విశాఖ జూ పార్క్ లో వదలాలని సూచించారు. అందుకోసం రాజమండ్రి చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆధ్వర్యంలో 10 హనుమాన్ బృందాలను ప్రత్యేకంగా నియమించారు. పులి మెడలో ఉన్న రేడియో కాలర్ ట్రాకింగ్ సిస్టం సందేశాల ఆధారంగా పులి తిరిగి జనావాసాల మధ్యకు రాక ముందే సురక్షితంగా పట్టుకోవాలని తెలిపారు. పులి కదలికలపై సమీప ఆవాసాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రాణనష్టం, జంతు నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ మొత్తం ప్రక్రియ పర్యవేక్షణ బాధ్యతను పీసీసీఎఫ్ శ్రీ పి.వి. చలపతిరావుకి అప్పగించారు. ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, హనుమాన్ బృందాలు సమర్ధవంతంగా పని చేస్తున్నాయని తెలిపారు. ప్రజలు కూడా సంయమనంతో వ్యవహరిస్తూ అటవీ సిబ్బందికి సహకరించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.