కూటమిపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి.. జనసేనను మరింత బలోపేతం చేద్దాం: బాలినేని శ్రీనివాసరెడ్డి

చిలకలూరిపేట : నరసరావుపేట పార్లమెంట్ జనసేన పార్టీ నిర్మాణ సారథుల పరిశీలకులు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గురువారం రాత్రి చిలకలూరిపేటలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన జనసేన పార్టీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, రానున్న రాజకీయ కార్యాచరణ, స్థానిక సంస్థల ఎన్నికలపై నాయకులకు దిశానిర్దేశం చేశారు.

పెంటేల బాలాజీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం

సమావేశానికి విచ్చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డికి జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజీ ఆధ్వర్యంలో జనసైనికులు, వీర మహిళలు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. నరసరావుపేట రోడ్డులోని ఫ్లైఓవర్ సెంటర్ వద్ద భారీ పూలమాలతో సత్కరించి, అక్కడి నుంచి వందలాది బైక్‌లు, కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.

ర్యాలీ సందర్భంగా “జై జనసేన”, “జై పవన్ కళ్యాణ్” నినాదాలతో చిలకలూరిపేట పట్టణం మారుమోగింది. బాణాసంచా పేలుళ్లు, డప్పు వాయిద్యాల మధ్య జనసైనికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పెంటేల బాలాజీ స్వయంగా ర్యాలీకి నాయకత్వం వహించడం పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.

పార్టీ పటిష్టతకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలి

సభలో మాట్లాడిన బాలినేని శ్రీనివాసరెడ్డి, చిలకలూరిపేటలో జనసైనికులు చూపిన ఉత్సాహం పార్టీ విజయానికి సంకేతమని అన్నారు. జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో వాస్తవాలతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

పార్టీలో విభేదాలకు తావులేకుండా అందరూ సమన్వయంతో పనిచేస్తూ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుని ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

అధినేత ఆశయాల సాధనే లక్ష్యం: పెంటేల బాలాజీ

జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజీ మాట్లాడుతూ, చిలకలూరిపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎల్లప్పుడూ ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటుందని తెలిపారు. భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జనసైనికులు, వీర మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు.

బాలినేని శ్రీనివాసరెడ్డి సూచనల మేరకు నియోజకవర్గంలో పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేస్తామని, అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ప్రజల్లోకి పార్టీ సిద్ధాంతాలు, కూటమి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను తీసుకెళ్తామని చెప్పారు. వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొట్టడంలో చిలకలూరిపేట జనసేన శ్రేణులు ఎల్లప్పుడూ ముందుంటాయని ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.