
నవ్యాంధ్రలో క్రియేటివ్ ఎకానమీకి ఊతమిచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. స్థానిక యువతకు సినీ, మీడియా, కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగాల్లో ప్రపంచ స్థాయి నైపుణ్యాలు అందించి ఉపాధి అవకాశాలను విస్తరించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
గురువారం రాష్ట్ర సచివాలయంలో జాడెక్స్ ఇన్నోవిజన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులతో మంత్రి సమావేశమై పలు అంశాలపై సమగ్రంగా చర్చించారు. రాష్ట్ర యువత ప్రతిభను వెలికితీసేందుకు ఆధునిక సినీ సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు తెలిపారు.
జులై నెలలో రాష్ట్ర స్థాయిలో మెగా ఫిల్మ్ వర్క్‌షాప్ నిర్వహించనున్నట్లు వెల్లడించిన మంత్రి, సినీ పరిశ్రమకు సంబంధించిన 24 క్రాఫ్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. అలాగే ఏఐ ఆధారిత ఫిల్మ్ మేకింగ్, ఆధునిక డిజిటల్ టెక్నాలజీల వినియోగంపై కూడా యువతకు శిక్షణ అందించనున్నట్లు వివరించారు.
24 క్రాఫ్ట్స్ శిక్షణ కార్యక్రమాల అమలుకు సంబంధించి జాడెక్స్ సంస్థ రూపొందించిన యాక్షన్ ప్లాన్‌పై సమావేశంలో విస్తృతంగా చర్చించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర యువతకు అంతర్జాతీయ స్థాయి ఫిల్మ్ మేకింగ్‌పై అవగాహన కల్పించి, సినీ మరియు మీడియా రంగాల్లో కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
సృజనాత్మక రంగాలను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రంలో క్రియేటివ్ ఎకానమీని బలోపేతం చేసి, నవ్యాంధ్రను సినీ, మీడియా, డిజిటల్ కంటెంట్ ఉత్పత్తిలో ప్రముఖ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.