24 గంటల్లో వాహన రిజిస్ట్రేషన్‌కు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

రాష్ట్రంలో వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మార్పులు తీసుకువస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. వాహనం కొనుగోలు చేసిన చోటే రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలా, వాహన డీలర్లను అదనపు రిజిస్ట్రేషన్ అథారిటీలుగా గుర్తించాలని ఆదేశించారు. ఈ విధానం ద్వారా కేవలం 24 గంటల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తవుతుందని, ప్రజలు రవాణా శాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఉంటుందని తెలిపారు.

సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కేంద్రం నుంచి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు. ప్రభుత్వ సేవలు వేగవంతంగా, పారదర్శకంగా అందేలా అధికారులు వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని దిశానిర్దేశం చేశారు.

ప్రభుత్వ సేవల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని విస్తరించాలని, దీనికోసం నిపుణులతో సలహా మండలి ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే రాష్ట్రంలో డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ, మైనింగ్ పర్యవేక్షణలో ఇతర రాష్ట్రాల విధానాలను అధ్యయనం చేసి అమలు చేయాలని ఆదేశించారు.

వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజల ఆరోగ్య రక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పేర్కొన్నారు. వడదెబ్బ నివారణకు మంచినీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ చేయాలని, స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలని సూచించారు. తాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రతి జిల్లా కలెక్టర్‌కు అత్యవసర నిధులుగా రూ.1 కోటి విడుదల చేయాలని ఆదేశించారు.

ప్రభుత్వ పథకాల అమలును పర్యవేక్షించేందుకు సీనియర్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. ప్రజాభిప్రాయ సేకరణకు కాల్ సెంటర్ వినియోగించాలని, అత్యవసర సేవలు మినహా మిగతా సేవలను ఆన్‌లైన్‌లో అందించాలని స్పష్టం చేశారు. చేపల వేట నిషేధం అనంతరం మత్స్యకారులకు ఉపయోగపడే విధంగా డేటా ఆధారిత సమాచారం అందించాలని కూడా ఆదేశించారు.

ఈ సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.