
మ్యాజిక్ డ్రెయిన్స్ తో పల్లెల్లో పారిశుధ్య విప్లవం తెచ్చారు
• గ్రామాల్లో మురుగునీటి సమస్యకు ఇది చక్కటి పరిష్కార మార్గం
• సిమెంటు డ్రెయిన్లతో పోలిస్తే 80 శాతం నిర్మాణ వ్యయం ఆదా
• ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి శ్రీమతి పి.వి. సింధు
పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన గ్రామీణాంధ్రప్రదేశ్ లక్ష్య సాధన కోసం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విప్లవాత్మక ఆలోచనలను అమలు చేస్తున్నారని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలంపిక్ మెడలిస్ట్ శ్రీమతి పి.వి. సింధు అభిప్రాయపడ్డారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల నుంచి పురుడు పోసుకున్న మ్యాజిక్ డ్రెయిన్స్ పల్లెల్లో మురుగు సమస్య నివారణలో గేమ్ ఛేంజర్ లాంటిదన్నారు. ఉప ముఖ్యమంత్రివర్యుల 20 నెలల పాలన గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ విడుదల చేసిన వీడియో సందేశంలో మ్యాజిక్ డ్రెయిన్స్ లాంటి సరికొత్త విధానాలు అమలు చేయడంపట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీమతి పి.వి. సింధు మాట్లాడుతూ “పాలనా వ్యవహారాలు కొత్తే అయినా శ్రీ పవన్ కళ్యాణ్ గారు వినూత్న కార్యక్రమాలతో ప్రజా సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషిస్తున్నారు. మన దేశంలో మెజారిటీ శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తుంటారు. అయితే గ్రామాల్లో పారిశుధ్యం పెద్ద సవాలుగా ఉంటుంది. సరైన మురుగు నీటి పారుదల వ్యవస్థ లేక ప్రజలు అపరిశుభ్ర వాతావరణంలో జీవనం సాగిస్తూ ఉంటారు. ఈ సమస్యకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మ్యాజిక్ డ్రెయిన్స్ రూపంలో అద్భుత పరిష్కార మార్గాన్ని కనుగొన్నారు. ఇంకుడు గుంతలతో కూడిన డ్రెయిన్లు ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీటిని క్షణాల్లో మాయం చేస్తాయి. మూడంచెల ఫిల్టర్ బెడ్ల ద్వారా శుద్ధి చేయబడిన నీటిని భూగర్భ జలంగా మార్చేస్తాయి. మురుగు నీటి నిల్వ, దుర్వాసన తదితర సమస్యలకు మ్యాజిక్ డ్రెయిన్లు చక్కటి పరిష్కార మార్గం. సాధారణ సిమెంట్ డ్రెయిన్ల నిర్మాణంతో పోలిస్తే మ్యాజిక్ డ్రెయిన్లకు 80 శాతం నిర్మాణ వ్యయం కూడా ఆదా అవుతుంది. గ్రామీణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంతోపాటు పారిశుధ్యాన్ని ఈ మ్యాజిక్ డ్రెయిన్లు పెంపొందిస్తాయి. ప్రజలు ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగించే వెసులుబాటు కల్పిస్తాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి కోసం శ్రీ పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులోనూ ఇలాంటి ముందు చూపుతో కూడిన వినూత్న కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని, గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారంతో, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, శ్రీ పవన్ కళ్యాణ్ గారి దార్శనికత్వంలో గ్రామీణాంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను” అన్నారు.
*శ్రీమతి పి.వి.సింధుకి ధన్యవాదాలు
అస్తవ్యస్తమైన డ్రెయినేజీ వ్యవస్థ, అడుగడుగునా అపరిశుభ్రంతో అల్లాడుతున్న గ్రామాల్లో ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సంకల్పం వెలుగులు నింపింది. ఇంకుడు కాలువలతో కూడిన మ్యాజిక్ డ్రెయిన్లు మురుగు రహిత పల్లెలను ఆవిష్కరిస్తున్నాయి. సిమెంట్ డ్రెయిన్లతో పోలిస్తే 80 శాతం ఖర్చును కూడా ఆదా చేస్తున్నాయి. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి స్వచ్ఛ సంకల్పం, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి సహకారంతో నిర్మిస్తున్న ఈ మ్యాజిక్ డ్రెయిన్ల మ్యాజిక్ పై తన విలువైన అభిప్రాయాన్ని వెలిబుచ్చిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలంపిక్ మెడల్ విన్నర్ శ్రీమతి పి.వి.సింధు గారికి ధన్యవాదాలు అంటూ డిప్యూటీ సీఎంఓ ఎక్స్ లో పోస్టు చేసింది.