
రాజకీయ వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిషోర్ చేసిన అంచనాలు ఇప్పుడు నిజమవుతున్నాయన్న చర్చ తమిళనాడు రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. నటుడు విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ ప్రస్తుత ఎన్నికల ఫలితాల్లో వందకు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండటం దీనికి కారణం.
కొంతకాలం క్రితం ఒక టీవీ ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్, విజయ్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ధైర్యంగా వ్యాఖ్యానించారు. ఏఐఏడీఎంకేతో పొత్తు అవకాశాలపై ప్రశ్నించగా, ఆ పార్టీ స్వతంత్రంగా బరిలోకి దిగుతుందని స్పష్టం చేశారు.
అంతేకాక, “ఈ వీడియోను దాచుకోండి.. ఫలితాల సమయంలో చూడండి” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం టీవీకే గణనీయమైన ఆధిక్యంలో ఉండటంతో ఆ క్లిప్ విస్తృతంగా షేర్ అవుతోంది.
విజయ్ తన రాజకీయ ప్రవేశానికి ముందు ప్రశాంత్ కిషోర్‌ను సలహాదారుగా నియమించుకున్న విషయం తెలిసిందే. ఆయన వ్యూహాల మేరకే టీవీకే రాష్ట్రంలోని ప్రధాన కూటములైన డీఎంకే, ఏఐఏడీఎంకేలతో పొత్తులు లేకుండా అన్ని 234 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసింది.
ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాలు చూస్తుంటే, పీకే వ్యూహం, విజయ్ ప్రజాదరణ కలిసి తమిళ రాజకీయాల్లో కొత్త సంచలనానికి నాంది పలికినట్లు కనిపిస్తోంది.