
న్యూఢిల్లీ, ఆగస్టు 5: పొగాకు రైతుల కోసం కాకుండా రాజకీయ ప్రచారం, ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యల కోసమే వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి యాత్ర చేపట్టారని రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు విమర్శించారు.
బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, హత్యలు, అత్యాచారాలు వంటి కేసుల్లో నిందితులను పరామర్శించే నాయకుడు ఇప్పుడు రైతులపై ప్రేమ చూపించడం రాజకీయ నాటకమేనని వ్యాఖ్యానించారు. విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అండగా నిలిచేది కూటమి ప్రభుత్వమేనని, నేరస్తులకు అండగా నిలిచేది వైఎస్సార్‌సీపీ అని ఆరోపించారు.
వారమంతా బెంగళూరులో గడిపి ఇప్పుడు పొగాకు రైతులను రాజకీయ ప్రచారానికి వాడుకోవాలని ప్రయత్నిస్తున్నారని, గతంలో రైతులకు ఎలాంటి సహాయం చేయని వారు ఇప్పుడు రైతుల పేరుతో రాజకీయాలు చేయడం కపటత్వమని అన్నారు.
ప్రపంచ మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితులు, బ్రెజిల్, టాంజానియా వంటి దేశాల నుంచి తక్కువ ధరలకు పొగాకు దిగుమతులు రావడంతో ఎఫ్‌సీవీ రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలిచిందని తెలిపారు.
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు ముఖ్యమంత్రి లేఖ రాయడంతో కంపెనీలు రైతుల వద్ద ఉన్న మొత్తం వర్జీనియా పొగాకును కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నారని చెప్పారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా సుమారు 100 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలుకు ఏర్పాట్లు చేశామని, రూ.188 కోట్లతో కొనుగోలు ప్రక్రియ చేపట్టామని తెలిపారు. కిలోకు రూ.20 ప్రోత్సాహకం, 45 వేల మంది రైతులకు రూ.50 వేల వడ్డీ లేని రుణం అందించడంతో పాటు మార్కెట్‌లో కిలో ధర రూ.200 కంటే తగ్గకుండా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పొగాకు రైతులను నిర్లక్ష్యం చేశారని, 2019 నుంచి 2024 వరకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఒక్క స్టోరేజ్ లేదా ప్రాసెసింగ్ కేంద్రం కూడా ఏర్పాటు చేయలేదని, 2022 తుఫాన్లలో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వలేదని విమర్శించారు.
రైతులను ఆదుకున్న చరిత్ర కూటమి ప్రభుత్వానిదని, రైతులపై కేసులు పెట్టిన చరిత్ర వైఎస్సార్‌సీపీదేనని సానా సతీష్ బాబు పేర్కొన్నారు.