జవహర్‌ నవోదయ, ఎన్‌ఎంఎంఎస్‌పై ఉపాధ్యాయులకు అవగాహన

మార్కాపురం అర్బన్: విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసి, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసేందుకు జవహర్‌ నవోదయ, జాతీయ సాధన–ఆదాయ ప్రాతిపదిక ప్రతిభా ఉపకార వేతన పరీక్షలు (ఎన్‌ఎంఎంఎస్‌)పై ఉపాధ్యాయులు విద్యార్థులకు విస్తృత అవగాహన కల్పించాలని విద్యాశాఖ అదనపు సంచాలకులు ఏ. సుబ్బారెడ్డి సూచించారు.

మార్కాపురం బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన అవగాహన సదస్సులో సుమారు 700 మంది పాల్గొన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో 100 రోజుల పాటు ‘మిషన్‌ నవోదయ’, ఉన్నత పాఠశాలల్లో ‘మిషన్‌ ఎన్‌ఎంఎంఎస్‌’ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని సుబ్బారెడ్డి సూచించారు.

విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించి, నిరంతరం మార్గదర్శకత్వం అందించాలని కోరారు. పోటీ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయడంలో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.

జిల్లా విద్యాశాఖ అధికారి సామ సుబ్బారావు మాట్లాడుతూ.. విద్యార్థుల విద్యా ప్రగతి కోసం ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని కోరారు. జవహర్‌ నవోదయ, ఎన్‌ఎంఎంఎస్‌ వంటి పోటీ పరీక్షల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా అవసరమైన శిక్షణ అందించాలని సూచించారు.

కార్యక్రమంలో ఉప విద్యాశాఖ అధికారులు పీ. శ్రీనివాసులు, జి. సంజీవి, సహాయ విద్యా సమన్వయకర్త ఆర్. కొండారెడ్డి, జిల్లా పర్యవేక్షణ అధికారి డి. రామిరెడ్డి, జవహర్‌ నవోదయ విద్యాలయ ఉప ప్రధానాచార్యులు రాజశేఖర్‌రెడ్డి, మండల విద్యాశాఖ అధికారులు, వివిధ మండలాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

జవహర్‌ నవోదయ, ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షల కోసం విశేషంగా కృషి చేస్తున్న పలువురు ఉపాధ్యాయులను ఈ సందర్భంగా సత్కరించారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.