అనకాపల్లిలో ఘనంగా ‘హర్ ఘర్ తిరంగా’ సైకిల్ ర్యాలీ

అనకాపల్లి: ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అనకాపల్లిలో ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా ఘనంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనకాపల్లి రింగ్ రోడ్డులోని ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం నుంచి పట్టణంలోని నాలుగు రోడ్ల జంక్షన్ వరకు ర్యాలీ కొనసాగింది.

కార్యక్రమానికి ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం సైకిల్ ర్యాలీని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్, మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ పాల్గొన్నారు. జిల్లా జేసీ, ఆంధ్రప్రదేశ్ పట్టణ ఆర్థిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ.. భారతదేశం 140 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉందన్నారు. ఎంతోమంది మహనీయుల త్యాగాలు, పోరాటాలు, ప్రాణత్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందని పేర్కొన్నారు.

స్వాతంత్ర్య దినోత్సవం కేవలం పండుగ కాదని, దేశం కోసం త్యాగం చేసిన మహనీయులను స్మరించుకునే పవిత్రమైన రోజని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ‘హర్ ఘర్ తిరంగా’ పిలుపుతో ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు.

భారతదేశానికి యువతే అతిపెద్ద బలమని, ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్ ముందుకు సాగుతోందని అన్నారు. రాబోయే రోజుల్లో ‘వికసిత్ భారత్’గా దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టే బాధ్యత యువతపై ఉందని తెలిపారు.

స్వాతంత్ర్యం సాధించేందుకు మన పూర్వీకులు చేసిన త్యాగాలను యువత తెలుసుకోవాలని, దేశ స్వాతంత్ర్యాన్ని కాపాడటంతో పాటు భారతదేశాన్ని మరింత శక్తివంతమైన, అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరారు.

కుల, మత, ప్రాంత, భాషా భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ‘మనమంతా భారతీయులం’ అనే భావనతో ఐక్యత, సోదరభావంతో ముందుకు సాగాలని అన్నారు. దేశ సమగ్రత, అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేయాలని, భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.