దేశ నిర్మాణంలో యువతే కీలకం: ఓఎస్డీ నవజ్యోతి మిశ్రా

మార్కాపురం: దేశ నిర్మాణంలో యువత పాత్ర ఎంతో కీలకమని ఓఎస్డీ నవజ్యోతి మిశ్రా అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మార్కాపురంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘దేశ నిర్మాణంలో భాగస్వాములం’ అనే నినాదంతో తిరంగా ర్యాలీ నిర్వహించారు.

స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నుంచి ప్రారంభమైన ర్యాలీలో విద్యార్థులు, పోలీసు అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులు జాతీయ జెండాలను చేతబూని ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశభక్తి, జాతీయ సమైక్యత, క్రమశిక్షణ, పౌర బాధ్యత, దేశ సేవ వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ర్యాలీ కొనసాగింది.

‘దేశ ప్రగతిలో మన వంతు’, ‘దేశ సేవలో మన బాధ్యత’, ‘ఐక్యతే బలం’, ‘దేశభక్తి–క్రమశిక్షణ’ వంటి నినాదాలతో విద్యార్థులు, పోలీసులు ప్రజల్లో స్ఫూర్తి నింపారు.

దేశ ప్రగతికి యువత శక్తిని సద్వినియోగం చేసుకోవడంతో పాటు ప్రతి ఒక్కరిలో దేశ సేవ పట్ల బాధ్యతా భావాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

కార్యక్రమంలో మార్కాపురం డీఎస్పీ యు. నాగరాజు, సీఐ ఎస్‌డీ. అల్తాఫ్ హుస్సేన్, మార్కాపురం పట్టణ ఎస్‌ఐ విశ్వనాథరెడ్డి, రూరల్ ఎస్‌ఐ వి. వేమనతో పాటు పోలీసు సిబ్బంది, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.