స్వాతంత్ర్య వేడుకలకు సర్వం సిద్ధం.. ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

మార్కాపురం జిల్లా కేంద్రంలోని ఎస్వీకేపీ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఆగస్ట్ 15న నిర్వహించనున్న 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వేడుకల ఏర్పాట్లను జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్‌రాజు, ఐపీఎస్‌ గురువారం పరిశీలించారు.

ఈ సందర్భంగా పరేడ్‌ ప్రాంగణం, వేదిక, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్‌ నియంత్రణ, వాహనాల పార్కింగ్‌, అధికారుల సీటింగ్‌, ప్రజలకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలను ఎస్పీ పరిశీలించారు. వేడుకలకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ముఖ్య అతిథులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున పటిష్టమైన భద్రతా చర్యలు, బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని తెలిపారు.

అనంతరం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో నిర్వహించనున్న పోలీస్‌ పరేడ్‌ రిహార్సల్స్‌ను ఎస్పీ పరిశీలించారు. ముందుగా గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పరేడ్‌ పరిశీలన వాహనంపై పోలీస్‌ బలగాల కవాతును పరిశీలించారు.

పరేడ్‌లో క్రమశిక్షణ, కవాతు నిర్వహణలో మెళకువలు, బృందాల సమన్వయంపై పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రెట్టించిన ఉత్సాహంతో కవాతు ప్రదర్శన నిర్వహించాలని సూచించారు.

కార్యక్రమంలో మార్కాపురం ఓఎస్డీ (అడ్మిన్‌) నవజ్యోతి మిశ్రా, ఐపీఎస్‌, ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ నాగేశ్వరరావు, డీఎస్పీ యు. నాగరాజు, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావు, ఆర్‌ఐ రమణారెడ్డి, మార్కాపురం టౌన్‌ ఎస్‌ఐ విశ్వనాథరెడ్డి, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.