
కోనసీమ : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు అమలాపురం పురపాలక సంఘం పరిధిలోని 1, 5, 6 వార్డుల్లో ప్రజా సమస్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. యూనిట్ ఇన్‌చార్జి బొర్రా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు.
ప్రధానంగా తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై ప్రజలు తమ సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను క్షుణ్ణంగా పరిశీలించిన నాయకులు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా బొర్రా చిట్టిబాబు మాట్లాడుతూ, వార్డుల అభివృద్ధికి సంబంధించిన ప్రతి సమస్యను పార్టీ అధిష్ఠానం మరియు సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు చేపడతామని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు అందేలా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని, స్థానిక ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు పేర్కొన్నారు.