భూ రీ సర్వే, 22-A భూముల సమస్యల పరిష్కారంపై రాష్ట్రస్థాయి సమీక్ష

అమలాపురం : రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీ సర్వే, 22-A నిషేధిత భూముల జాబితా సవరణ, కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ, ఐవీఆర్ఎస్ ద్వారా అందుతున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార పురోగతిపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్, భూ పరిపాలన ముఖ్య కమిషనర్ (సీసీఎల్ఏ) జి. జయలక్ష్మి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

విజయవాడ నుంచి జరిగిన ఈ సమీక్షలో అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు పాల్గొన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి జాయింట్ కలెక్టర్ వైఖోం నైదియా దేవి జిల్లా అధికారులతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న భూ రీ సర్వే ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూ రికార్డుల ప్రక్షాళన ద్వారా రైతులకు శాశ్వత భూ హక్కులు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

22-A నిషేధిత భూముల జాబితాలో ఉన్న అర్హులైన రైతుల దరఖాస్తులను చట్టపరమైన నిబంధనల మేరకు త్వరితగతిన పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీలో ఎలాంటి జాప్యం ఉండకూడదని, ఐవీఆర్ఎస్ ద్వారా వచ్చే భూ సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులకు ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడిన జాయింట్ కలెక్టర్ వైఖోం నైదియా దేవి, కోనసీమ జిల్లాలో భూ రీ సర్వే ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో భూ రికార్డులను క్రమబద్ధీకరించి, అర్హులైన ప్రతి రైతుకు కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.