స్మశాన స్థలం కేటాయింపుకు కలెక్టర్‌కు జనసేన వినతి

సర్వేపల్లి నియోజకవర్గం: సర్వేపల్లి గ్రామంలో స్మశాన స్థల సమస్యపై జనసేన పార్టీ నేతలు జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. సర్వేపల్లి నియోజకవర్గం సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు, ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి భవాని నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

గ్రామంలో బలిజ, చాకలి, మంగలి, కుమ్మరి, యాదవ కులాల ప్రజలు వినియోగిస్తున్న స్మశాన స్థలం కొత్తగుంట ధోరువు పోరంబోకు ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతంలో సుమారు 300 ఎకరాల భూమి సాగు భూమిగా ఉండటంతో పాటు వర్షాకాలంలో పూర్తిగా నీటితో నిండిపోతుంది. దీంతో అంత్యక్రియల సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు తెలిపారు.

వర్షాకాలంలో మోకాళ్ల లోతు నీటిలో శవాలను తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించి, సుమారు మూడు ఎకరాల భూమిని స్మశాన స్థలంగా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సమస్యకు త్వరితగతిన పరిష్కారం లభించి, ఐదు కులాల ప్రజలకు సురక్షితమైన స్మశాన స్థలం ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పినిశెట్టి మహేష్, పోట్లూరు సుబ్రహ్మణ్యం, వెంకటాచల మండల కార్యదర్శి సందూరి శ్రీహరి, మనుబోలు మండల ప్రధాన కార్యదర్శి శివరాత్రి సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.