
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. నటుడిగా ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు సంపాదించిన ఆయన, ఇప్పుడు దర్శకుడిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
తన 23వ చిత్రం (RAPO23)తో రామ్ తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించనున్నట్లు సమాచారం. ఇందులో రామ్ “వీర” అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ‘ది స్టోరీ ఆఫ్ ఏ లోన్ వోల్ఫ్’ అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది.
ఈ సినిమాతో పాటు రామ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కుటుంబానికి చెందిన స్రవంతి మూవీస్ బ్యానర్ ఉన్నప్పటికీ, ప్రత్యేకంగా ‘RAPO Cinematics’ అనే కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ బ్యానర్‌పై ఆయన సోదరుడు కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
దర్శకుడిగా తన కొత్త ప్రయాణంపై స్పందించిన రామ్, “ఇన్నాళ్లు వాళ్ల కథల్లో నా ముఖం చూశారు.. ఈ కథలో నా గొంతు వింటారు” అంటూ సోషల్ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచాయి.
భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రం 2026 డిసెంబర్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.