ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన

ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు ఎదురుదెబ్బలు కొనసాగుతున్నాయి. ధర్మశాల వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో పంజాబ్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ సీజన్‌లో జట్టుకు ఇది వరుసగా ఐదో పరాజయం కావడంతో ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.

మ్యాచ్ అనంతరం మాట్లాడిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ ఓటమిపై తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. ఈ పరాజయాన్ని అంగీకరించడం కష్టమని చెప్పిన ఆయన, జట్టులో ఏ ఒక్కరినీ నిందించలేమని స్పష్టం చేశాడు.

“ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టం. కానీ మ్యాచ్‌లో జరిగిన ఏ ఒక్క సందర్భాన్ని తప్పుబట్టాలని అనుకోవడం లేదు. ఇది అద్భుతమైన పోరు. ఇరు జట్లు గొప్పగా పోరాడాయి” అని అయ్యర్ పేర్కొన్నాడు.

ముంబై బ్యాటర్ తిలక్ వర్మ ప్రదర్శనపై కూడా అయ్యర్ ప్రశంసలు కురిపించాడు. “తిలక్ వర్మ అసాధారణంగా ఆడాడు. అతను షాట్లను ఎంచుకున్న తీరు, ఫీల్డర్ల మధ్య నుంచి బంతిని పంపించిన విధానం అద్భుతం. ఈ విజయానికి పూర్తి క్రెడిట్ అతనికే చెందుతుంది” అని అన్నాడు.

అలాగే తమ జట్టు ఆటగాడు అజ్మతుల్లా ఒమర్జాయ్ బ్యాటింగ్‌ను కూడా ప్రత్యేకంగా కొనియాడాడు. ఒక దశలో జట్టు 170-180 పరుగులకే పరిమితం అవుతుందని భావించామని, కానీ ఒమర్జాయ్ దూకుడు ఆటతో మ్యాచ్ మొమెంటంను మార్చేశాడని తెలిపాడు.

“అతను ఆడిన స్కూప్ షాట్లు అద్భుతంగా ఉన్నాయి. అతడి దూకుడు బ్యాటింగ్ వల్లే మేము 200 పరుగుల మార్క్‌ను చేరుకోగలిగాం” అని శ్రేయస్ అయ్యర్ వ్యాఖ్యానించాడు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.