‘స్పిరిట్’ రిలీజ్‌పై క్లారిటీ.. వాయిదా వార్తలను ఖండించిన మేకర్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’ విడుదల వాయిదా పడుతోందన్న వార్తలకు చిత్రబృందం చెక్ పెట్టింది. సినిమాను ముందుగా ప్రకటించిన తేదీకే విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా స్పష్టం చేయడంతో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలకు ముగింపు పలికినట్లైంది.

‘స్పిరిట్’ చిత్రాన్ని 2027 మార్చి 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే అదే నెలలో ఈద్ సందర్భంగా సల్మాన్ ఖాన్ నటిస్తున్న మరో భారీ చిత్రం విడుదల కానుండటంతో, పోటీని దృష్టిలో పెట్టుకుని ‘స్పిరిట్’ విడుదలను డిసెంబర్ 2027కు వాయిదా వేయనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ ఊహాగానాలపై స్పందించిన నిర్మాణ సంస్థలు టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. సినిమా విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని, ‘స్పిరిట్’ అనుకున్న ప్రణాళిక ప్రకారమే షూటింగ్ మరియు నిర్మాణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశాయి. ప్రకటించిన విధంగానే 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు వెల్లడించాయి.

ఈ చిత్రంలో ప్రభాస్ తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. పాన్-వరల్డ్ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాను మొత్తం 8 భాషల్లో విడుదల చేయనున్నారు. తాజా ప్రకటనతో సినిమా వాయిదాపై వస్తున్న అన్ని పుకార్లకు మేకర్స్ పూర్తిగా తెరదించారు.

Share this article

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.