పిఠాపురంలో టీడీపీ–జనసేన మధ్య మరోసారి ఫ్లెక్సీ వివాదం

ఠాపురంలో మరోసారి టీడీపీ–జనసేన పార్టీల మధ్య వివాదం చోటుచేసుకుంది. టీడీపీ నేత వర్మ, జనసేన నేతల మధ్య ఫ్లెక్సీ విషయంలో వాగ్వాదం జరిగింది. ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో లేకపోవడంపై టీడీపీ నేత వర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై జనసేన నేత పెండెం దొరబాబు ఆగ్రహంతో వర్మపైకి దూసుకెళ్లారు. ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారి, ఇరుపార్టీల కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది.

హైలైట్స్:

  • పిఠాపురంలో మరోసారి ఫ్లెక్సీ వివాదం
  • చంద్రబాబు ఫోటో లేకపోవడంపై వర్మ అభ్యంతరం
  • వర్మపైకి దూసుకెళ్లిన జనసేన నేత దొరబాబు
  • వైసీపీ నుంచి వచ్చి పెత్తనం చేస్తున్నారని వర్మ ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య మరోసారి వివాదం రేగింది. పిఠాపురం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయం వద్ద నిర్వహించిన PMJAY (ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన) కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది.

కార్యక్రమానికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో లేకపోవడంపై టీడీపీ నేత వర్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబుతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూడా జోక్యం చేసుకుని వర్మతో వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరగడంతో దొరబాబు వర్మపైకి దూసుకెళ్లారు. దీంతో ఇరుపార్టీల నేతలు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు జోక్యం చేసుకున్నారు.

దొరబాబు ప్రవర్తనపై టీడీపీ నేత వర్మ తీవ్రంగా స్పందించారు. గతంలో టీడీపీ పోరాడిన వ్యక్తులు ఇప్పుడు వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో తప్పనిసరిగా ఉండాలని అన్నారు. చంద్రబాబు నాయుడు ఫోటోకు అవమానం జరిగితే తాను సహించనని హెచ్చరించారు.

అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ను గెలిపించుకున్నామని, డిప్యూటీ సీఎంకు అవమానం జరిగినా తాము ఊరుకోమని చెప్పారు. వైఎస్సార్‌సీపీ నుంచి జనసేనలోకి వచ్చిన దొరబాబు ఇలాంటి వివాదాలకు కారణమవుతున్నారని ఆరోపించారు. ఆయనపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని కూడా విమర్శించారు. వైసీపీ నుంచి వచ్చిన వారు జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే కఠినంగా స్పందిస్తామని హెచ్చరించారు. అయితే పిఠాపురంలో టీడీపీ, జనసేన మధ్య పెద్దగా విభేదాలు లేవని, తామంతా ఒకే కుటుంబమని పేర్కొన్నారు.

గత నెలలో కూడా పిఠాపురంలో ఇలాంటి ఫ్లెక్సీ వివాదం జరిగింది. పారిశుద్ధ్య కార్మికుల శిక్షణ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫోటో చిన్నగా ఉందని వర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సమయంలో కూడా వేదికపై నుంచి దిగిపోవడం, కార్యక్రమం మధ్యలో వెళ్లిపోవడం జరిగింది.

ఇటీవల జరిగిన ఈ ఘటనతో పిఠాపురంలో టీడీపీ–జనసేన మధ్య విభేదాలు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన నేత దొరబాబు మధ్య జరిగిన ఈ ఘర్షణ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.