

వి.ఆర్.పురం: 2017 కట్ఆఫ్ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండని యువతీ, యువకులు ప్రస్తుతం 25 సంవత్సరాలకు పైబడిన వారిగా, వారిలో చాలామంది వివాహం చేసుకుని కుటుంబాలు ఏర్పరుచుకున్నారని జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ములకాల సాయికృష్ణ పేర్కొన్నారు.
కట్ఆఫ్ తేదీ నిర్ణయించి తొమ్మిదేళ్లు గడిచినా ఇప్పటికీ పునరావాస కేంద్రాలకు తరలించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పునరావాస కేంద్రాలకు తరలిస్తే ఆర్అండ్ఆర్ ప్యాకేజీ లేకుండా ఇళ్లు లేక కుటుంబాలతో ఎలా జీవించాలని ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో 2017లో నిర్ణయించిన కట్ఆఫ్ తేదీని 2022కు మార్చి అర్హులైన వారందరికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీతో పాటు పునరావాసం కల్పించాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.
ములకాల సాయికృష్ణ, జడ్పీటీసీ సభ్యుడు వాళ్ల రంగారెడ్డి ఆధ్వర్యంలో నిర్వాసిత యువతతో కలిసి ఐటీడీఏ పీవో శుభమ్ నొక్వాల్ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ యూత్ ప్రెసిడెంట్ పెడపెట్ల పవన్ కళ్యాణ్, అల్లాడ శ్యామ్, పరాంకుశం మణికంఠ, నమ్మల్వార్తో పాటు వివిధ గ్రామాలకు చెందిన యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.