అభివృద్ధి, ఆకాంక్షలకు పెద్ద ‘పీఠిక’పురం

అభివృద్ధి అంటే కేవలం కాగితాల మీద పెట్టే సంతకాలు కాదు… సామాన్యుడి కళ్లలో కనిపించే సంతృప్తి అని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు బలంగా నమ్ముతారు. ఆ నమ్మకానికి తగ్గట్టే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ నియోజక వర్గంగా తీర్చిదిద్దుతున్నారు. పారదర్శక 

పాలన, స్థిరమైన అభివృద్ధికి కేరాఫ్ గా మార్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు వందల కోట్ల రూపాయల నిధులను మౌలిక సదుపాయాల కల్పన, విద్య, వైద్యం, ఆధ్యాత్మిక, పారిశ్రామికాభివృద్ధిపై ఖర్చు చేస్తున్నారు. ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచే లక్ష్యంతో అనేక సంక్షేమ, సాధికార కార్యక్రమాలను అమలు చేస్తున్నారు.
• మురికివాడల రూపురేఖలు మార్పు
పిఠాపురం పట్టణంలో 30 మురికివాడల్లో దాదాపు 35 వేల మంది జనాభా దశాబ్దాలుగా నివసిస్తున్నారు. కనీస మౌలిక వసతులు కరవై నరకయాతన అనుభవించారు. రోడ్లు, సరైన డ్రైనేజీ వ్యవస్థ, సురక్షితమైన మంచినీటిసరఫరా వంటి ప్రాథమిక అవసరాలకు కూడా వారు నోచుకోలేదు. మురికివాడలపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక దృష్టిసారించడంతో పరిస్థితిలో ఇప్పుడు మార్పు కనిపిస్తోంది. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా చర్యలు తీసుకోవడం, యుద్ధప్రాతిపదికన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడంతో దశాబ్ధాల నిర్లక్ష్యం నుంచి ఈ ప్రాంతాలు క్రమంగా బయటపడుతున్నాయి. నవ శకంలోకి అడుగు పెడుతున్నాయి.
• అభివృద్ధి పరుగులు
పిఠాపురాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు. ఎంతో విశిష్టత కలిగిన ఈ ఆధ్యాత్మిక క్షేత్రానికి నిత్యం 3 నుంచి 4 వేల మంది వరకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకొని అమృత్ భారత్ పథకం కిందరూ.37.25 కోట్ల నిధులతో రైల్వేస్టేషన్ ను ఆధునీకరిస్తున్నారు. స్టేషన్‌ ముఖద్వారం, ఆధునిక మరుగుదొడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, ప్లాట్‌ఫారం అభివృద్ధి, షెల్టర్ల నిర్మాణం తదితర పనులు జరుగనున్నాయి. పిఠాపురం ఆర్టీసీ బస్టాండ్

 ను కూడా నవీకరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో పిఠాపురం మున్సిపాలిటీ సెకండ్ గ్రేడ్ నుంచి సెలక్షన్ గ్రేడ్ కు, గొల్లప్రోలు నగర పంచాయతీ నుంచి గ్రేడ్ 3 మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ అయ్యాయి. సెలక్షన్ గ్రేడ్ హోదా వల్ల మున్సిపాలిటీకి ప్రభుత్వ నిధుల కేటాయింపు పెరిగి, మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగవంతం అవుతుంది. ఉప్పాడ తీరంలో సముద్ర కోతను నివారించడానికి రూ.323 కోట్ల వ్యయంతో త్వరలోనే శాశ్వత సీ ప్రొటెక్షన్ వాల్ నిర్మాణం పనులు ప్రారంభం కానున్నాయి. ఈ నిర్మాణం పూర్తయితే తీరప్రాంత గ్రామాలకు శాశ్వత రక్షణ కలుగుతుంది.
• రోడ్ ఛేంజర్
ప్రజా రవాణా, వాణిజ్యం, అత్యవసర సేవలకు రోడ్లే కీలకం. రహదారులు సక్రమంగా ఉంటేనే ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుంది. అటువంటి రోడ్ల నిర్మాణం, నిర్వహణను గత ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. తొలి విడతలో మరమ్మతులకు ప్రాధ్యానం ఇచ్చిన ప్రభుత్వం రెండో విడతలో పూర్తిస్థాయిలో రహదారుల నిర్మాణానికి చర్యలుచేపట్టింది. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్‌ కళ్యాణ్‌ గారి చొరవతో కాకినాడ జిల్లాలో సుమారు రూ.800 కోట్ల 

అంచనా వ్యయంతో రహదారుల అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో సుమారు రూ.234 కోట్ల అంచనా వ్యయంతో 409 రోడ్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఏకే మల్లవరం- ఉప్పరగూడెం, బీచ్ రోడ్ – మల్లవరం రహదారులను చెరో రూ.4 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు. రూ.3.62 కోట్లతో చెందుర్తి- చేబ్రోలు రహదారి, రూ.3.60 కోట్లతో చిత్రాడ-గోర్స రహదారి, రూ.3.50 కోట్లతో చేబ్రోలు- అడవిపుంత రహదారుల పనులు ప్రారంభమయ్యాయి. నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధి కోసం నాబార్డ్ నుంచి రూ.10.95 కోట్లు, సాస్కీ నుంచి రూ.94 కోట్లు, ఉపాధి హామీ నిధులు రూ. 87.18 కోట్లు, ఆర్ అండ్ బీ ద్వారా రూ. 43.62 కోట్ల నిధులు సమీకరించారు.
• యువతకు ఉపాధి… ఎంఎస్ఎంఈ పార్క్
ఉపాధి అవకాశాల కోసం యువత ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగా ఉద్యోగాలు సాధించేలా కుటమి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కు అభివృద్ధి, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పనుల కోసం ప్రభుత్వం రూ.9.60 కోట్ల నిధులు మంజూరు చేసింది. చిన్న తరహా పారిశ్రామికవేత్తలకు అవసరమైన అన్ని సదుపాయాలతో కూడిన ప్లగ్-అండ్-ప్లే విధానంలో దీనిని అభివృద్ధి చేస్తున్నారు.
• ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు
ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం జలజీవన్‌ మిషన్‌ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా కాకినాడ జిల్లాలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ను చేపట్టింది. ఏలేరు రిజర్వాయర్ నుంచి నీటిని సేకరించి, అత్యాధునిక పద్దతుల్లో శుద్ధి చేసి ప్రజలకు అందించే ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం రూ.1663 కోట్ల అంచనా వ్వయంతో ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. దీని ద్వారా జిల్లాలోని 14 మండలాలకు సురక్షితమైన తాగునీరు అందనుంది. పిఠాపురం నియోజకవర్గంలో ఈ పథకం కింద రూ.376 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా గొల్లప్రోలు, పిఠాపురం, యు.కొత్తపల్లి మండలంల్లోని గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు అందనుంది. నాగులపల్లి సమగ్ర రక్షిత మంచినీటి సరఫరా పథకం కోసం రూ.12 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. పనులు కూడా పూర్తయ్యాయి. ఈ పథకం ద్వారా యు.కొత్తపల్లి, పిఠాపురం మండలాల్లోని గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు అందిచనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న 3 వేల గ్రామాలను ప్రభుత్వం గుర్తించింది. అందులో 7 గ్రామాలు (కొడవలి, వన్నెపూడి, భోగాపురం, నాగులపల్లి, పి.రాయవరం, పి.దొంతమూరు, నవకండ్రవాడ) పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ గ్రామాల్లో తాగునీటి వ్యవస్థలను ఆధునీకరించి, వేసవిలో కూడా మంచినీటి కొరత లేకుండా చూడటానికి జలజీవన్ మిషన్ పథకం కింద రూ.17.67 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయి.
• ప్రజారోగ్యానికి పెద్ద పీట
పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల సమయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ అమలవుతోంది. పిఠాపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన నిర్మాణ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. రూ.34 కోట్ల అంచనా వ్యయంతో నిర్మితమవుతున్న ఈ ఆసుపత్రిలో అధునాతన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. పెంచిన పడకలకు అవసరమైన ప్రత్యేక భవనాలు, ఆపరేషన్‌ థియేటర్లు, వార్డులు, కావలసిన ప్రత్యేకమైన సౌకర్యాల కల్పనకు ఈ నిధులను వెచ్చిస్తారు. పెరిగిన ఆసుపత్రి సామర్థ్యానికి అనుగుణంగా 66 మంది అదనపు వైద్య సిబ్బందిని నియమించనున్నారు. కార్పొరేట్ తరహాలో రేడియాలజీ, డెర్మటాలజీ, ఆప్తమాలజీ వంటి విభాగాలు ఏర్పాటు కానున్నాయి. మరోవైపు గ్రామాల్లో సైతం కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందించే లక్ష్యంతో పనులు వేగవంతంగా చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతున్నారు. వైద్యం అంటే కేవలం మందులు ఇవ్వడమే కాదు…రోగికి మానసిక ప్రశాంతతను కూడా పంచాలనే గొప్ప సంకల్పంతో వీటిని ఆధునీకరిస్తున్నారు.
• వసతి గృహాలకు మహర్దశ
అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థుల భద్రత, ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తూ ఆంధ్రప్రదేశ్ విద్య, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో రూ.1.37 కోట్ల అంచనాలతో ప్రభుత్వ వసతి గృహాల్లో సౌకర్యాల కల్పనకు శ్రీకారం చుట్టారు. ఈ నిధులతో వసతి గృహాల్లో ఆర్వో ప్లాంట్లు, పటిష్టమైన కాంపౌండ్ వాల్ నిర్మాణం, వైర్ ఫెన్సింగ్, సీజనల్ వ్యాధుల నుంచి విద్యార్థులకు రక్షణ కల్పించడానికి దోమ తెరలు, టాయిలెట్ల ఆధునీకరణ వంటి పనులు చేపడుతున్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకులంలో పేద విద్యార్థులు కార్పొరేట్ స్థాయి శిక్షణ పొందేలా సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఐఐటీ, నీట్ శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు సౌకర్యవంతంగా చదువుకోవడానికి ఫర్నిచర్, సీలింగ్ ఫ్యాన్లు, అధునాతన లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు అవుతోంది.
• నైపుణ్యాభివృద్ధి శిక్షణతో యువతకు ఉపాధి
ఆధునిక పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన మానవ వనరులను తీర్చిదిద్దే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం కోసం శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో ప్రత్యేకంగా ఒక స్కిల్ హబ్ ను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు, ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీవై) మార్గదర్శకాలకు అనుగుణంగా పలు రకాల (డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ అసిస్టెంట్, అసిస్టెంట్ బ్యూటీ థెరపిస్ట్, అప్లికేషన్ డెవలపర్) సర్టిఫైడ్ కోర్సుల్లో శిక్షణ అందిస్తోంది. తద్వారా స్థానిక యువతలోని నైపుణ్యానికి పదును పెట్టి వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తోంది.
• యువత ఆశలకు ఊపిరి… జాబ్ మేళా
గతంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం యువత హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు వలస వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) ఆధ్వర్యంలో ప్రముఖ కంపెనీలే పిఠాపురానికి వస్తున్నాయి. ఏడాదిలో నాలుగైదుసార్లు జాబ్ మేళాలు నిర్వహిస్తూ గ్రామీణ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. 2024-25 సంవత్సరంలో నిర్వహించిన నాలుగు జాబ్ మేళాల ద్వారా 138 అభ్యర్థులు ఉద్యోగాలు పొందితే, 2025-26లో 349 మందికి ఉద్యోగాలు లభించాయి. గత ఏడాదితో పోలిస్తే ఉద్యోగ నియామకాల్లో 152% పెరుగుదల నమోదైంది.
• క్రీడా వికాసానికి ప్రోత్సాహం
గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించి మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలన్న సంకల్పంతో క్రీడా వికాస కేంద్రాల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. మత్స్యకార యువతకు పుట్టుకతో వచ్చే ఈత నైపుణ్యాన్ని సానబెట్టి, జాతీయ స్థాయి వేదికలపై వారిని విజేతలుగా నిలబెట్టేందుకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. సుమారు కోటి రూపాయల నిధులతో ఆర్ఆర్బీహెచ్ఆర్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఉన్న ఇండోర్ స్టేడియంను ఆధునీకరిస్తున్నారు.
• ఆతిథ్యానికి సిద్ధమవుతున్న ఉప్పాడ
ఎక్కువ మందికి ఉపాధిని చూపిస్తూ, ఏటా వృద్ధి రేటు నమోదు చేస్తున్న రంగాల్లో ఆతిథ్యం రంగం చాలా ముఖ్యమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఉప్పాడలో స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థను ఏర్పాటు చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే కాకినాడ, పిఠాపురం పరిసర ప్రాంతాల్లోని యువత అతిథ్య రంగంలో స్థిరపడటానికి గొప్ప వేదికగా మారుతుంది.
• పిఠాపురం పారిశ్రామిక ప్రగతి
పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక పారిశ్రామిక హబ్‌గా మార్చాలనే సంకల్పంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముందడుగు వేస్తున్నారు. 18 నెలల్లో దాదాపు రూ. 34,853 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించారు. వీటి ద్వారా 5 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. చిన్న తరహా పరిశ్రమలకు చేయూతనివ్వడం కోసం రూ.9.6 కోట్లతో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తున్నారు. రూ.34,844 కోట్లు భారీ పెట్టుబడితో గ్రీన్ అల్యూమినియం స్మెల్టర్ ఫ్యాక్టరీ ఏర్పాటు కానుంది. వీటితో పాటు అనుబంధ పరిశ్రమలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
• ఆలయాలకు పునరుజ్జీవం
ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పిఠాపురాన్ని అభివృద్ధి చేసే ప్రణాళికను శ్రీ పవన్ కళ్యాణ్ గారు వేగంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇందులో సుమారు రూ.20 కోట్ల నిధులతో 19 ప్రధాన దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నారు. ఈ నిధులతో పిఠాపురంలో పురాతన, శిథిలావస్థకు చేరిన ఆలయాలకు పూర్వ వైభవం తీసుకురావడమే కాకుండా, భక్తులకు మెరుగైన వసతులు కల్పించనున్నారు. శ్రీ కుక్కుటేశ్వర స్వామి, శ్రీ పురుహూతికా దేవి ఆలయాల అభివృద్ధికి రూ.6 కోట్లు కేటాయించారు. దీని ద్వారా పిండ ప్రదాన, అన్నదాన మండపాల నిర్మాణంతోపాటు కోనేరు మరమ్మతులు చేపడతారు. పిఠాపురం మండలంలో కొలువైన శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవాలయం పనులకు రూ.28 లక్షలు, శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం అభివృద్ధికి రూ. 65 లక్షలు, శ్రీ సకలేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధికి రూ. 1.10 కోట్లు, గొల్లప్రోలు ప్రాకార మండప నిర్మాణానికి రూ. 1.32 కోట్లు, చేబ్రోలు కథా కాలాక్షేప మండపం నిర్మాణానికి రూ. 48.50 లక్షలు, శ్రీ పాద శ్రీ వల్లభ మహా సంస్థానంలో శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠి డార్మిటరీ భవన పునర్నిర్మాణం కోసం రూ.1.80 కోట్లు, ధ్యాన మందిరం కోసం రూ.2.30 కోట్లు, శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధి కోసం రూ.1.30 కోట్లు, శ్రీ విజయ జనార్దన స్వామి దేవాలయం ప్రాకార గోడ నిర్మాణానికి రూ. 6.50 లక్షలు నిధులు మంజూరు చేశారు. టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ నిధులతో కాకినాడ జిల్లా వ్యాప్తంగా 419 ఆలయాల నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తున్నారు.
• రైతన్నకు ఉపకారం
ఎండనక, వాననక రేయింబవళ్లు కష్టపడి దేశానికి అన్నంపెట్టే రైతు సమాజంలో గౌరవంగా బతకాలనేది శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆకాంక్ష. ప్రకృతి వైపరీత్యాలు, అప్పుల బాధలు ఎదురైనా కుంగిపోకుండా, మళ్లీ విత్తనం నాటి పంటను పండించే అంకితభావం రైతుకే సొంతం. అన్నదాతలకు అండగా నిలిచేలా అకాల వర్షాలు, మొంథా తుపాను ప్రభావంతో పంటలు నష్టపోయిన నియోజకవర్గ రైతులకు రూ. 25.85 కోట్ల పరిహారం ప్రభుత్వం నుంచి అందేలా చూశారు. అన్నదాత సుఖీభవ పథకం కింద 23,105 మంది రైతులకు ఏటా రూ.20 వేలు చొప్పున రూ.42.75 కోట్లు నేరుగా నగదు సహాయం అందిస్తున్నారు. 4,904 మంది కౌలు రైతులకు రూ. 22.48 కోట్లు అందించి మద్దతుగా నిలిచారు. దిగుబడి పెంచేందుకు 13,270 మెట్రిక్ టన్నుల ఎరువులను సబ్సిడీ ద్వారా అందించారు. రైతుల శ్రమను తగ్గించి, పంట దిగుబడి పెంచేందుకు రూ.23.83 కోట్ల విలువైన వ్యవసాయ యంత్రాలను అందించారు.
నియోజకవర్గవ్యాప్తంగా వివిధ గ్రామాల్లో పెండింగ్ లో ఉన్న రైతు సేవా కేంద్రాలను పూర్తి చేయడానికి రూ.4.02 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. రైతులకు టార్పాలిన్ల పంపిణీ కోసం రూ. 62 లక్షలు, ధాన్యం ఆరబోయడం కోసం ఏడు ప్రత్యేక కమ్యూనిటీ డ్రైయింగ్ ప్లాట్‌ఫారమ్‌ల నిర్మాణానికి రూ. 60 లక్షల ప్రతిపాదనలు తుది దశలో ఉన్నాయి.
• ఆదాయం “పట్టు”
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చేబ్రోలు పట్టు రైతులకు అన్ని విధాల అండగా నిలబడి వారికి లాభాల బాట పట్టించారు. ప్రభుత్వ పట్టుగూళ్ల మార్కెట్ లో మెరుగైన వసతులు, కొత్త షెడ్ నిర్మాణానికి రూ.35 లక్షలు నిధులు మంజూరు చేశారు. మునుపెన్నడూ లేని విధంగా 11 మెట్రిక్ టన్నుల అమ్మకాల వల్ల రైతులకు రూ.74.28 లక్షల నికర లాభం చేకూరింది. మైసూరు ఎన్.ఎస్.ఎస్.ఒ. నుంచి సేకరించిన 38,200 వ్యాధి రహిత పట్టు పురుగు గుడ్లు నుంచి 17,578.72 మెట్రిక్ టన్నుల పట్టుగూళ్లు ఉత్పత్తి అయ్యాయి. దీని ద్వారా రైతులకు సుమారు కోటి రూపాయల ఆదాయం సమకూరింది. బైవోల్టిన్ ప్రోత్సాహక కార్యక్రమం కింద కిలోకు రూ. 50 చొప్పున రూ. 3,05,07,218 నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. పురుగుల మందుల వల్ల నష్టపోయిన 86 మంది రైతులను గుర్తించి వారికి రూ.11.35 లక్షల పరిహారం అందించారు. పట్టు పురుగులకు వ్యాధులు సోకకుండా వాడే క్రిమిసంహారక మందుల కోసం రూ. 25 లక్షలు కేటాయించారు.
• ఉద్యాన రైతులకు ఊతం
ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు కూటమి సర్కార్ అండగా నిలుస్తోంది. వారికి మరింత ఊతమిచ్చి, సాగును ప్రోత్సహించేందుకు నిధులు అందిస్తోంది. నియోజకవర్గంలో ఉన్న 956 మంది ఉద్యాన పంటలు పండించే రైతులకు రూ.96.18 లక్షలు నేరుగా నగదు సహాయం అందించారు. అధునాతన పాలీహౌస్ నిర్మాణం, ఆర్కిడ్ పూల సాగు కోసం రూ.18.84 లక్షలు కేటాయించారు. ఫామ్ పాండ్ ఏర్పాటుకు రూ. 90 వేలు వెచ్చించారు. మిచౌంగ్ తుపాను వల్ల నష్టపోయిన 377 మంది రైతులకు రూ.16.03 లక్షల పరిహారం అందించారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రూ.25 లక్షలు విలువ చేసే 245 వ్యవసాయ పరికరాలను 50 శాతం సబ్సిడీతో రైతులకు అందించారు. దీని ద్వారా 66 మంది రైతులకు ప్రయోజనం చేకూరింది.
• పాడికి ప్రోత్సాహం
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక పాడి పరిశ్రమ. నియోజకవర్గంలో ఉన్న 14,184 పాడి రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2.20 కోట్లు ఖర్చు చేసింది. పశుగ్రాసం, విత్తనాలు సరఫరా చేయడానికి ప్రభుత్వం రూ.12.91 లక్షలు అందించింది. దీనివల్ల 1254 మంది రైతులు లబ్ధి పొందారు. గడ్డి కత్తిరించే యంత్రాలు రాయితీపై అందించడంతో 12,920 మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. పశుసంవర్ధక శాఖ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఎన్ఎల్ఎమ్ పథకం ద్వారా 10 మంది పాడి రైతులకు రాయితీతో కోటి రూపాయలను అందించారు. నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో కొత్త పశువైద్యశాలల నిర్మాణానికి రూ.1.92 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ పశువైద్య కేంద్రాలలో ఆధునిక, అత్యవసర వైద్య పరికరాలను సమకూర్చడం కోసం రూ.15.5 లక్షలు కేటాయించారు. తక్కువ పెట్టుబడితో అదనపు ఆదాయాన్నిచ్చే పెరటి కోళ్ల పెంపకం పథకం కోసం కోటి రూపాలతో చేసిన ప్రతిపాదనలు తుది దశకు చేరుకున్నాయి.
• మత్స్యకారుల సేవలో
ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద కోనపాపపేటలో కోస్టల్ రెసిలియంట్ కోస్టల్ ఫిషింగ్ విలేజ్(సి.ఆర్.సి.ఎఫ్.వి.) కేంద్రాన్ని రూ.2 కోట్లతో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ బహుళార్ధసాధక కమ్యూనిటీ సెంటర్ మత్స్యకారుల శిక్షణ, భద్రత, జీవనోపాధి అభివృద్ధికి ఒక ప్రధాన కేంద్రంగా ఉపయోగపడుతుంది. అమీనాబాద్ లో మినీ ఫిషింగ్ హార్బర్ అత్యాధునిక సదుపాయాలతో నిర్మిస్తున్నారు. వీటితో పాటు సముద్రంలో వేటకు వెళ్లే 672 పడవలకు రూ.1.95 కోట్లు వెచ్చించి ట్రాన్స్ పాండర్లు అమర్చారు. ఇది జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా మత్స్యకారులకు సముద్రంలో నిరంతర భద్రతను కల్పిస్తుంది. 1200 పడవల యజమానులకు రూ. 5.09 కోట్ల డీజిల్ రాయితీ అందించారు. మత్స్యకార సేవ పథకంలో భాగంగా 7,017 మంది మత్స్యకారులకు రూ. 14.03 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. చేపల వేటతో పాటు సముద్రం నుంచి ఇతర మార్గాల్లో ఆదాయాన్ని సృష్టించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.